Cyber Crime | హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మల్టీలెవల్ మార్కెటింగ్ మోసాలు మళ్లీ పెరుగుతున్నాయి. వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులు, హెర్బల్, హెల్త్‌కేర్, గృహోపకరణాలు, క్రిప్టో కరెన్సీ అమ్మకాల పేరిట పిరమిడ్ తరహాలో ఈ మోసాలు జరుగుతున్నాయి. తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు ఆర్జించవచ్చని, ఎంత మంది ఏజెంట్లను చేర్పిస్తే అన్ని రివార్డులు, పాయింట్లు లభిస్తాయని కేటుగాళ్లు ఆశచూపుతున్నారు. దీంతో ముందూ వెనుకా ఆలోచించకుండా ఎంతో మంది అత్యాశకు పోయి భారీగా నష్టపోతున్నారు. ఇలాంటి ఉదంతాలు నానాటికీ పెరుగుతుండటంతో మల్టీలెవల్ మారెటింగ్ మోసాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.
సైబర్ మోసగాళ్ల కొత్త పన్నాగం
సైబర్ మోసాలపై ప్రజల్లో అవగాహన పెరగడంతో కేటుగాళ్లు మల్టీలెవల్ మార్కెటింగ్‌పై కన్నేశారని, గొలుసుకట్టు వ్యాపారం పేరుతో వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రకటనలు గుప్పించి అమాయకులను మోసగిస్తున్నట్టు తెలుస్తున్నది. మల్టీలెవల్ మారెటింగ్ సీములను నడిపే కేటుగాళ్లలో చాలా మంది విదేశాల్లోనే ఉండి పిరమిడ్ రాకెట్‌ను నడుపుతున్నారని, భారీ లాభాలతోపాటు లగ్జరీ కార్లు, ఫారిన్ టూర్ల పేరిట తమ ముఠాలతో అమాయకులకు వల వేస్తున్నారని సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు.
అత్యాశకుపోతే మోసపోవుడే!
అతి తక్కువ సమయంలో అధిక లాభాలు వస్తాయని ఎవరైనా చెప్తే అది మోసమేనని గ్రహించాలి. లేకుంటే మిమ్మల్ని రొంపిలోకి దింపి డబ్బులు కొల్లగొడతారు. అత్యాశకుపోతే మోసపోవడం ఖాయం. గొలుసుకట్టు మార్కెటింగ్‌లో తొలుత చేరిన వారికే లాభాలు వస్తాయి. ఆ తర్వాత చేరిన వారంతా తీవ్రంగా నష్టపోవాల్సిందే. ఇలాంటి నెట్‌వర్క్‌లలో ఎవరూ చేరొద్దు. ఆయా నెట్‌వర్క్‌ల నిర్వాహకులు, కంపెనీలు పెట్టే సభలు, సమావేశాలకు ఎవరూ వెళ్లొద్దు. సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి. అనుమానాస్పద ప్రకటనలు, వెబ్‌లింకులు, ఏపీకే ఫైల్స్ జోలికి వెళ్లొద్దు. మోసపూరిత ప్రకటనలపై వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 ద్వారా లేదా వాట్సప్ నంబర్ 8712672222 ద్వారా ఫిర్యాదు చేయండి.
– శిఖా గోయెల్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ