Mudhol Congres | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందే అభ్యర్థులను ప్రకటించి అధికార బీఆర్ఎస్ పై చేయి సాధించగా, అభ్యర్థుల ఖరారు విషయమై విపక్షాలు అంతర్గత కుమ్ములాటలకు పరిమితం అయ్యాయి. అసెంబ్లీ టికెట్ల కేటాయింపులో ఖమ్మం జిల్లాలో బీసీ నాయకులకు ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేస్తారు ఆ పార్టీ బీసీ నేతలు.. మరోవైపు మంగళవారం జరిగిన ఆదిలాబాద్ జిల్లా ముధోల్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల విస్త్రుత స్థాయి సమావేశం రసాభాసగా ముగిసింది.
పార్టీలో సముచిత స్థానం ఇవ్వడం లేదని స్థానిక నాయకుడు విజయ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ కండువా కింద పడేసి బయటకు వెళ్లిపోయారు. ముధోల్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు విజయ్ కుమార్ రెడ్డి.
స్థానిక నాయకులను పార్టీ నాయకత్వం పట్టించుకోవడం లేదని ముధోల్ కాంగ్రెస్ నేత విజయ్ కుమార్ రెడ్డి చెప్పారు. పార్టీ కొందరి చెప్పు చేతల్లో నడుస్తుందన్నారు. స్థానికేతరులకే పార్టీలో ప్రాధాన్యం కల్పిస్తున్నారని మండి పడ్డారు.