హైదరాబాద్, అక్టోబర్ 8(నమస్తే తెలంగాణ): యాదాద్రి భువనగిరి జిల్లా దండుమల్కాపూర్‌లోని నైపుణ్య శిక్షణాకేంద్రం ఈ ఏడాది డిసెంబర్ నాటికి అందుబాటులోకి వస్తుందని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో తెలంగాణ ఇండస్ట్రియలిస్ట్స్ ఫెడరేషన్ కోసం అభివృద్ధి చేసిన ఎంఎస్ఎంఈ-గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్‌లో దీనిని ఏర్పాటుచేస్తున్నట్టు వివరించారు.
ఇండస్ట్రియల్ పార్క్‌లు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ఏర్పాటు ద్వారా స్థానిక నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణతోపాటు ఉపాధి అవకాశాలు పెంచడమే ప్రభుత్వ ధ్యేయమని శనివారం ఆయన ట్వీట్ చేశారు. దండుమల్కాపూర్ ఇండస్ట్రియల్ పార్క్‌లో 589 యూనిట్ల స్థాపనకు వీలుంటుందని తెలిపారు. ఇందులో ప్రత్యక్షంగా 20 వేలమందికి, పరోక్షంగా 16 వేల మందికి ఉపాధి లభిస్తుందని వెల్లడించారు.
ఇండస్ట్రియల్ పార్క్‌లో విద్యుత్తు, నీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ తదితర మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం రూ.236 కోట్లు ఖర్చుచేసింది. రాష్ట్రంలో తొలిసారిగా ‘వాకింగ్ టు వర్క్’ విధానాన్ని అమలుచేయాలనే ఉద్దేశంతో అక్కడ పనిచేసే కార్మికులు, ఉద్యోగులకు 194 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్, స్కూళ్లు, మార్కెట్, రిక్రియేషనల్ ఏరియా, బ్యాంకులు, ఫైర్‌స్టేషన్, దుకాణాలు అభివృ ద్ధి చేస్తున్నారు. 2.5 లక్షల చదరపు అడుగుల వైశాల్యంలోఅత్యాధునిక నైపుణ్య శిక్షణ, కామన్ ఫెసిలిటీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
ప్రస్తుతం 10 యూనిట్లు ఉత్పత్తులు ప్రారంభించాయి. మరో 90 యూనిట్ల నిర్మా ణం వేగంగా సాగుతున్నది. ఇందులో సుమా రు 200 సూక్ష్మ తరహా, మిగిలినవి చిన్న, మధ్యతరహా యూనిట్లు ఏర్పాటు కానున్నా యి. 2 వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్‌ను అభివృద్ధి చేయాలని ప్రతిపాదనలు ఉండగా, ఇప్పటికే ప్రభుత్వం 1,250 ఎకరాలు సేకరించింది. 450 ఎకరాలు ఎంఎస్ఎంఈలకు కేటాయించింది. వీటిద్వారా రూ.2వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా. అత్యాధునిక మౌలిక సదుపాయాలతో ప్రభుత్వం ద్వారా ఇంత భారీస్థాయిలో అభివృద్ధి చేసిన ఎంఎస్ఎంఈ పార్క్ దేశంలో ఇదే మొదటిదని తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య అధ్యక్షుడు సుధీర్‌రెడ్డి తెలిపారు.