Manda Krishna Madiga | మాదిగ సంస్కృతికి చిహ్నమైన డప్పులు తమ 30 ఏండ్ల వర్గీకరణ పోరాటానికి ఊపిరి పోశాయని, ఈ నెల ఏడో తేదీన జరిగేది తమ వారసత్వ ప్రదర్శన అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ అన్నారు. తమ వారసత్వ ప్రదర్శన కోసం నిర్వహించే లక్ష డప్పులు, వెయ్యి గొంతుకల కార్యక్రమానికి పలు అంశాల పేరిట అనుమతి నిరాకరించడం బాధాకరం అని చెప్పారు. సోమవారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 30 ఏండ్ల పాటు వర్గీకరణ పోరాటం జరిగినా ఏనాడు కూడా శాంతిభద్రతలకు విఘాతం కలిగించ లేదన్నారు. మాదిగ జాతి ప్రజల మూలలను పరిరక్షించేందుకు లక్ష డప్పులు, వెయ్యి గొంతుల పేరుతో సాంస్కృతిక ప్రదర్శనకు శ్రీకారం చుట్టామన్నారు. తమ సంస్కృతికి నిదర్శనమైన డప్పు ప్రతి ఉద్యమానికి ప్రధానమైందన్నారు. దశాబ్దాలుగా తమపై అంటరానితనం ప్రదర్శించిన వారికే తమ డప్పులు ఉపయోగపడ్డాయన్నారు.
డప్పు సంస్కృతి కనుమరుగవుతున్న తరుణంలో గత చరిత్రను గుర్తుంచుకునేలా ఈ లక్ష డప్పులు, వెయ్యి గొంతుకల కార్యక్రమం నిర్వహించదలిచామని మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. దీనిని ప్రభుత్వం ఓ సాంస్కృతిక ప్రదర్శనగా చూడాలన్నారు. కానీ, ప్రభుత్వం పలు అంశాలను సాకుగా చూపుతూ అనుమతి నిరాకరించిందని చెప్పారు. ఈ కార్యక్రమానికి ఎంత మంది హాజరవుతారో నిర్ధిష్టంగా పేర్కొనలేదని, ట్రాఫిక్ జామ్ అవుతుందని, వీవీఐపీ జోన్ కావడంతో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని, పౌరులకు ఇబ్బంది కలుగుతుందని పలు సాకులు చెప్పారన్నారు.
గత 30 సంవత్సరాల్లో ఎమ్మార్పీఎస్ ఉద్యమంలో ఎప్పుడూ శాంతిభద్రతలకు విఘాతం కలుగలేదని మందకృష్ణ మాదిగ చెప్పారు. కానీ ప్రభుత్వం తమ సాంస్కృతిక ప్రదర్శనను నిరాకరించడం బాధాకరమన్నారు. ఈ నెల 7న సైతం గాందేయ మార్గంలోనే ప్రదర్శన నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వానికి మరోసారి లేఖ ద్వారా విన్నవిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో తెలంగాణ క్రాంతి దళ్ అధ్యక్షుడు పృథ్విరాజ్ యాదవ్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవింద్ నరేశ్ మాదిగ, ప్రజా కళాకారుడు దరువు ఎల్లన్న, సీనియర్ జర్నలిస్టు ఇస్మాయిల్, రెడ్డి జాగృతి అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మార్పీఎస్ జాతీయ అధికార ప్రతినిధి బొర్ల బిక్షపతి మాదిగ, రాజేందర్, నరసింహ, బైరపోగు శివకుమార్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.