హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ): ‘దిశ’ హత్య కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌పై జస్టిస్ సిర్పూరర్ కమిషన్ నివేదించిన అంశాలను ఫరూక్నగర్ ఇన్చార్జి ఎమ్మార్వో పాండు హైకోర్టులో సవాల్ చేశారు. ఎన్‌కౌంటర్‌కు ముందు నిందితులు మహ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్‌కుమార్, చింతకుంట చెన్నకేశవులుకు రిమాండ్ విధించడంలో తాను స్వతంత్రంగా వ్యవహరించలేదని, రిమాండ్ ఉత్తర్వులు సరిగ్గా లేవని సిర్పూర్కర్ కమిషన్ పేర్కొనడాన్ని రద్దు చేయాలని కోరారు. ఆ నివేదిక తన పనితీరును ఆక్షేపించేలా ఉన్నదని, దాని ఆధారంగా తనపై చర్యలు చేపట్టకుండా ఉత్తర్వులు ఇవ్వాలని శుక్రవారం ఆయన హైకోర్టు సీజే ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీ ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. ‘దిశ’ నిందితుల అరెస్టు సమయంలో ప్రజలు భారీగా గుమికూడారని, ఈ నేపథ్యంలో నిందితులు బయటకువస్తే శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందన్న భావనతోనే వారిని రిమాండ్‌కు తరలించాలని ఆదేశించానని వివరించారు. ఈ విషయాలను సిర్పూరర్ కమిషన్ పరిగణనలోకి తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఈ అంశంపై విచారణ ఏప్రిల్ 11కు వాయిదా పడింది.