హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు కాంగ్రెస్ సర్కారు సమాయత్తమవుతున్నది. ఎన్నికల కసరత్తును అధికార యంత్రాంగం ముమ్మరం చేసింది. హైదరాబాద్ మహానగర విస్తరణలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని అనేక గ్రామాలు సమీప మున్సిపాలిటీల్లో విలీనం కావడంతో మేడ్చల్ జిల్లా పరిషత్ కనుమరుగు కానున్నది. కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేయడం, కార్పొరేషన్లలో గ్రామాలు విలీనం కావడం వల్ల ఎంపీటీసీ స్థానాల సంఖ్య 40-50 మేరకు తగ్గనున్నది. 2019 ఎన్నికల సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీ స్థానాలు 5,847 ఉండగా, ఆ సంఖ్య దాదాపు 5,800 వరకు తగ్గవచ్చని అధికారులు చెప్తున్నారు. రాష్ట్రంలో మండలాల సంఖ్య 539 నుంచి 566కు పెరిగింది. ఎంపీటీసీ స్థానాల సంఖ్య మాత్రం తగ్గుతున్నది. 2001నాటి జనాభాను పరిగణనలోకి తీసుకోవడం, 3000 ఓటర్లకు ఒక ఎంపీటీసీ ఉండటం, కొత్త గ్రామాలు పెరగడం వల్ల ఎంపీటీసీ స్థానాల సంఖ్య సుమారు 50 తగ్గుతున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి.
566 జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకు ఎన్నికలు!
రాష్ట్రంలో 2019 ఎన్నికల నాటికి 32 జిల్లా పరిషత్లు ఉండగా, ఇప్పుడు మేడ్చల్ కనుమరుగైతే, 31 జెడ్పీలకే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. గతంలో 539 మండల పరిషత్లు ఉండగా, ఇప్పుడు వాటి సంఖ్య 566కు పెరిగింది. ఈ మేరకు 566 జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకు ఎన్నికల కోసం కసరత్తు జరుగుతున్నది. కొత్త లిస్టు ప్రకారం.. నల్లగొండ జిల్లాలో అత్యధికంగా 33 జడ్పీటీసీ స్థానాలు, ఆ తర్వాత నిజామాబాద్ జిల్లాలో 31, సిద్దిపేట జిల్లాలో 26, కామారెడ్డిలో 25 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. అతి తక్కువగా ములుగు జిల్లాలో 10 జడ్పీటీసీ స్థానాలే ఉన్నాయి. 2019లో 12,769 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగగా, ఇప్పుడు వాటి సంఖ్య 12,777కు చేరింది. ప్రస్తుతం ఎన్నికల నిర్వహణ ప్రక్రియకు సంబంధించిన రిజర్వేషన్లు, మండలాలు, గ్రామాలు, వార్డుల సంఖ్యను ఖరారు చేసే పనుల్లో యంత్రాంగం తలమునకలైన ఉన్నట్టు అధికారవర్గాలు వెల్లడించాయి.
2019లో ఎన్నికల నాటికి
జిల్లా పరిషత్లు : 32
మండల పరిషత్లు: 539
గ్రామ పంచాయతీలు: 12,769
గ్రామాల వార్డులు : 1,13,136
జడ్పీటీసీ స్థానాలు: 539
ఎంపీటీసీ స్థానాలు: 5,847
2025లో సుమారుగా
జిల్లా పరిషత్లు : 31
మండల పరిషత్లు: 566
గ్రామ పంచాయతీ: 12,777
గ్రామాల వార్డులు: 1,12,700
జడ్పీటీసీ స్థానాలు : 566
ఎంపీటీసీ స్థానాలు: 5,800