Vinod Kumar | పదవులు శాశ్వతం కాదని.. రాజకీయంగా ప్రతి వ్యక్తి పోటీలో ఉండాలని మాజీ ఎంపీ వినోద్, కరీంనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా ఎంపీపీ, జడ్పీటీసీల ఆత్మీయ సన్మాన కార్యక్రమం జరిగింది. మాజీ మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి వినోద్ పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా మనకొండూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన వినోద్ మాట్లాడుతూ కొంత మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీని విడవచ్చు కానీ.. ఉన్న వారందరు కలిసికట్టుగా పని చేయాలన్నారు. రానున్న రోజుల్లో యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని కేసీఆర్ సూచించారన్నారు.
వచ్చే ఐదు సంవత్సరాల తర్వాత తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అన్ని స్థానాల్లో గులాబీ జెండాను ఎగురవేస్తామన్నారు. కేసీఆర్ నాయకత్వాన ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పని చేయాలని సూచించారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ పార్టీ కోసం నాయకులు పనిచేయాలని, ప్రతిపక్ష పార్టీలు మీదనే ఎక్కువ ఆశలు ప్రజలకు ఉంటాయన్నారు. అన్ని డ్యాములు ఎండిపోయాయని.. నీళ్లు లేక రైతులు అవస్థలు పడుతున్నారన్నారు. పార్టీలో ఉన్నవారిని ఆదుకుంటామని.. యువతకు పెద్దపీట వేస్తామన్నారు. కరీంనగర్ అంటే కేసీఆర్‌కు ఇష్టం, ప్రతి ఒక్కరూ కూడా కలిసి కట్టుగా పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, ఒడితెల సతీశ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, మేయర్ సునీల్ రావు, మాజీ జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, గెల్లు శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.