హైదరాబాద్, అక్టోబర్ 17(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కొత్తగా నియమితులైన ఎంపీడీవోలకు శిక్షణ ఇచ్చే విషయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయాలు గందరగోళానికి దారితీశాయి. ఖాళీగా ఉన్న 144 ఎంపీడీవో పోస్టులకు గ్రూప్-1 ద్వారా 144మందిని ఎంపిక చేశారు. వీరిలో 12మంది రిపోర్టు చేయలేదని తెలిసింది. ఎంపీడీవోలుగా నియమితులైన 131 మందిని 26 జిల్లాలకు నియమించారు. మిగతా ఐదు జిల్లాల్లో ఖాళీలు లేవు. వీరిలో మల్టీజోన్-1కు 77 మంది, మల్టీజోన్-2కు 54మందిని కేటాయించారు. వీరికి కనీసం మూడు నెలల శిక్షణ ఇచ్చిన అనంతరం ఆయా జిల్లాల్లోని మండలాల్లో ఎంపీడీవోలుగా పోస్టింగులు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, 15 రోజుల శిక్షణ తర్వాత అంటే ఈ నెల 27న ఆయా మండలాలకు వారిని కేటాయిస్తామని అధికారవర్గాలు వెల్లడించాయి.
ఎంపీడీవోగా చేరేవారు తొలుత హెచ్వోడీలను కలిసి ఆ తర్వాత కలెక్టర్ల వద్దకు వెళ్లాలి. జిల్లాల్లో రిపోర్టింగ్ చేశాక మండలాల పోస్టింగ్ కలెక్టర్ ఇస్తారు. కొత్తగా ఎంపికైన ఎంపీడీవోలకు శిక్షణ ఇవ్వాలనే హడావుడిలో ఉన్నతాధికారులు రాజేంద్రనగర్‌లోని శిక్షణ సంస్థలోని కార్యాలయానికే జిల్లా పరిషత్ అధికారులను పిలిపించుకున్నారు. సోమవారం ఉదయం జడ్పీ సీఈవోలు వచ్చి రాజేంద్రనగర్‌లోని శిక్షణ కేంద్రంలో జాయినింగ్ ఆర్డర్, వెంటనే రిలీవ్ అయినట్టు రెండు ఆర్డర్స్ ఇవ్వాలని కమిషనర్ కార్యాలయం నుంచి జిల్లా అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. జడ్పీ సీఈవోలు హడావుడిగా రాజేంద్రనగర్‌కు వచ్చి జాయినింగ్, రిలీవ్ ఆర్డర్లు ఇచ్చి శిక్షణ ప్రారంభించినట్టు తెలిసింది.
పార్లమెంట్ ఎన్నికల సమయంలో సొంత జిల్లాల్లో పనిచేస్తున్న ఎంపీడీవోలను ఇతర జిల్లాలకు బదిలీ చేశారు. ఎన్నికల తర్వాత వారిని యథాస్థానాలకు బదిలీ చేయాలి. కానీ అలా చేయకపోవడంతో తమను బదిలీ చేయాలని 127మంది ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. గతంలో కొందరిని, తాజాగా 8మంది కలిపి 54మందికి స్థానచలనం కల్పించారు. ఇంకా 70మంది తమ సొంత జిల్లాలకు బదిలీల కోసం ఎదురుచూస్తున్నారు.