హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి అలుగు వర్షిణి అనాలోచిత నిర్ణయాలతో సీవోఈల్లోని విద్యార్థుల భవిష్యత్ నాశనమయ్యే పరిస్థితి వచ్చిందని గౌలిదొడ్డి సీవోఈ కళాశాల విద్యార్థులు, తల్లిదండ్రుల మండిపడుతున్నారు. సీఎం, సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎంవోతోపాటు అసెంబ్లీ స్పీకర్‌కు సైతం విన్నవించామని వివరించారు. అయినా తమ సమస్య పరిష్కారం కాలేదని శనివారం ప్రకటన విడుదల చేశారు. గౌలిదొడ్డి ప్రీమియర్ సీవోఈ కళాశాలలో అందజేసే నీట్, జేఈఈ శిక్షణకు రాష్ట్రవ్యాప్తంగా రెండు దశల్లో ప్రవేశ పరీక్షలు నిర్వహించి, మెరిట్ సాధించిన విద్యార్థులకే అడ్మిషన్ కల్పిస్తారని వివరించారు. కానీ ఈ ఏడాది సొసైటీ సెక్రటరీ అనాలోచిత నిర్ణయాలతో అందులోని విద్యార్థుల భవిష్యత్తు అంధకారంగా మారుతున్నదని తెలిపారు.
రాష్ట్రంలో ఎకడా లేని విధంగా ఎంపీసీని ఒక దగ్గర, బైపీసీని ఒక దగ్గర వేర్వేరుగా ఏర్పాటు చేశారని తెలిపారు. అదీగాక మెరిట్ ద్వారా అడ్మిషన్ పొందిన విద్యార్థులను ఇప్పుడు వేరొక కళాశాలకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేస్తున్నారని వాపోయారు. మారులు తకువ వచ్చాయనే నెపంతో ఇతర కళాశాలల విద్యార్థులను పంపి వారి బంగారు భవిష్యత్‌ను నాశనం చేస్తున్నారని వివరించారు. ఈ అంశాలపై 20 రోజులుగా అనేకమందిని కలుస్తూ తమ స మస్యను విన్నవించామని, అయినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని గౌలిదొడ్డి కళాశాల విద్యార్థులు, తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని, విద్యార్థులను యథావిధిగా అకడే కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేదంటే విద్యార్థులతో కలిసి ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు. తమ పోరాటానికి ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, విద్యార్థి సంఘ నాయకులు మద్దతుగా నిలవాలని విజ్ఞప్తిచేశారు.