హైదరాబాద్, సెప్టెంబర్14(నమస్తే తెలంగాణ): రాజ్యాధికారమే ధ్యేయంగా ముందుసాగాలని రాజ్యసభ సభ్యుడు, మున్నూరుకాపు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్‌లో ట్రస్ట్ ఆఫ్ పటేల్స్ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం నగర శివారులోని నాగారాం ల్యాండ్ మార్క్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. ఏపీ, తెలంగాణ మంత్రివర్గంలో మున్నూరుకాపులు లేకపోవడం ఇప్పుడే చూస్తున్నామన్నారు.
అసెంబ్లీలోనూ ఎమ్మెల్యేల సంఖ్య తగ్గిందని చెప్పారు. వచ్చే మంత్రివర్గ విస్తరణలో ప్రాతినిధ్యం దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ట్రస్ట్ ఆఫ్ పటేల్స్ ఏర్పాటును స్వాగతిస్తున్నానని పేర్కొన్నారు. ఎంపీ నిధుల నుంచి జగిత్యాల జిల్లాకు చెందిన మిచ్చమ్మ ట్రస్ట్, ట్రస్ట్ ఆఫ్ పటేల్స్కు రెండు ఆంబులెన్స్‌లు అందజేస్తానని హామీ ఇచ్చారు. సమావేశంలో విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వీ ప్రకాశ్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ సభ్యుడు సీ విఠల్, రౌతు కనుకయ్య పాల్గొన్నారు.