హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): దేశంలోని ప్రతి లోక్‌సభ నియోజకవర్గానికి ఒకటి చొప్పున వ్యవసాయ వ్యాపార కేంద్రాలను నెలకొల్పాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కోరారు. గురువారం రాజ్యసభలో సహకార రంగంపై జరిగిన చర్చలో రవిచంద్ర పలు అంశాలను లేవనెత్తారు. సహకార సంఘాల్లో సాంకేతికతను జోడించడం, సభ్యులకు సామాజిక భద్రత పథకానికి ప్రాధాన్యం ఇచ్చి ప్రోత్సహించాలని కోరారు.
కేంద్ర బడ్జెట్లో సహకార రంగానికి మరిన్ని నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. దీంతో ఈ రంగాన్ని బలోపేతం చేస్తూ యువతకు, మహిళలకు మరింత తోడ్పాటు అం దించాలని ఆర్థిక మంత్రిని కోరారు. సహకా ర రంగానికి 2022-23 బడ్జెట్లో రూ.900 కోట్లు ఖర్చు చేశారని, 2023-24 బడ్జెట్లో తొలుత కేవలం 55 కోట్లు కేటాయించి, ఆ తతర్వాత మరో 300 కోట్ల అంచనాతో సవరించారని తెలిపారు. ప్రస్తుత 2024-25 బడ్జెట్లో 500 కోట్లు కేటాయించారని, పెంపు విషయమై సమీక్షించాలని కోరారు.
గత పదేండ్లలో తెలంగాణలో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు, మహిళా, చేనేత, వివిధ వృత్తిదారులకు ఆయా సహకార సంఘాల ద్వారా ఆర్థిక భరోసా కల్పించడంతో రాష్ట్రం లో గ్రామీణాభివృద్ధి పురోగతి సాధించిందని చెప్పారు. ఆ పదేండ్లలో వ్యవసాయం, అనుబంధ సహకార రంగాలు అద్భుతమైన ప్రగ తి సాధించాయని వివరించారు. కొత్తగా 8 వేల గొర్రెల పెంపకందారుల సొసైటీలను నెలకొల్పి సుమారు 5 వేల కోట్లతో లక్షలాది యూనిట్ల గొర్రెలను పంపిణీ చేసినట్టు చెప్పారు.
రైతులకు రుణాలు, పెట్టుబడి సాయం, గిట్టుబాటు ధరలు అందించడం వల్ల పంటల ఉత్పత్తి భారీగా పెరిగి, వాటిని నిల్వ చేసేందుకు తెలంగాణ వ్యాప్తంగా నూతన గోదాముల నిర్మాణం కూడా చేపట్టినట్టు వివరించారు. సహకార రంగంలో సప్ల య్ వ్యవస్థ సమర్థవంతంగా లేకపోవడం, మౌలిక సదుపాయాలు, రవాణా, మారెట్ లింకేజీ వంటి కారణాలతో పంటలు పండించిన తర్వాత రైతులు ఎకువగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మన దేశంలో వరి, గోధుమ వంటి నిత్యావసర ఆహార ధాన్యాల నష్టాలను అరికట్టే చర్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నదని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.