హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిబంధనలు ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని, వీసీలను నియమించే అధికారం గవర్నర్‌కు కట్టబెట్టడం విడ్డూరమని మాజీ ఎంపీ వినోద్‌కుమార్ విమర్శించారు. డబ్బులు రాష్ట్రాలు ఖర్చుపెడితే కేం ద్రం పెత్తనం చెలాయించడమేంటని మండిపడ్డారు. ఎన్డీయే భాగస్వామ్యపక్షాలతోపాటు దేశంలోని అనేక రాష్ట్రాలు ఈ ముసాయిదాపై నిరసన తెలుపుతున్నాయని పేర్కొన్నారు. ఎన్డీయే కీలక భాగస్వామి బీహార్ సీఎం నితీశ్‌కుమార్‌తోపాటు కేరళ ముఖ్యమంత్రి సైతం అభ్యంతరం వ్యక్తం చేశారని గుర్తుచేశారు. తమిళనాడు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపడంతో పాటు సీఎం స్టాలిన్ కేంద్రం వైఖరిపై తీవ్రంగా మండిపడ్డారని అన్నారు. కానీ ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి ఇప్పటివరకు స్పందించకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్లో శుక్రవారం బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, గెల్లు శ్రీనివాస్, ఆంజనేయగౌడ్, బాలరాజుయాదవ్, రాకేశ్‌కుమార్, వాసుదేవరెడ్డి, కురు వ విజయ్‌కుమార్, బొమ్మెర రామ్మూర్తితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వినోద్ మాట్లాడుతూ.. ప్రస్తుత యూజీసీ నిబంధనల ప్రకారం ప్రొఫెసర్ల నియామకం సైతం కేంద్రం చేతుల్లోకి వెళ్తుందని ఆవేదన వ్యక్తంచేశారు. వెంటనే ఈ నిబంధనలను రద్దుచేయాలని డిమాండ్ చేశారు.
అసెంబ్లీలో తీర్మానం చేయాలి
రాష్ట్రాల హక్కులను హరించే విధంగా ఉన్న యూజీసీ ముసాయిదాకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే సీఎం చిత్తశుద్ధిని శంకించాల్సి వస్తుందని తెలిపారు. తక్షణమే తెలంగాణ వైఖరిని తెలిపాలని సూచించారు.
భిన్నత్వంలో ఏకత్వానికి విఘాతం: దాసోజు
యూజీసీ నిబంధనలు భిన్నత్వంలో ఏక త్వం అనే సూత్రాన్ని విస్మరిస్తున్నాయని దాసోజు శ్రవణ్ ఆక్షేపించారు. కేంద్రం వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గమని మండిపడ్డారు. ప్రాంతీయ భాషల్లో చదువుకొనే విద్యార్థులకు గొడ్డలిపెట్టులా మారనున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మతతత్వ ఎజెండాను అమలు చేసేందుకు కేంద్రం కంకణం కట్టుకున్నదని విమర్శించారు. ఒకే వర్గం భావజాలాన్ని సిలబస్‌లో ప్రవేశపెట్టేందుకు కుట్ర చేస్తున్నదని ఆరోపించారు. యూజీసీ నిబంధనలను నిరసిస్తూ కేంద్రానికి బీఆర్ఎస్ తరఫున ఐదు పేజీల లేఖ రాశామని తెలిపారు.
కేంద్రానికి రేవంత్ వంత:గెల్లు శ్రీనివాస్
యూజీసీ నిబంధనలను అనేక రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నా సీఎం రేవంత్ మాత్రం మౌనం గా ఉండటం వెనుక ఆంతర్యమేంటని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. ప్రధాని మోదీ ఫెడరల్ స్ఫూర్తిని మంటగలుపుతున్నా సీఎం మౌనంగా ఉండటాన్ని చూస్తుంటే వంతపాడుతున్న విషయం అర్థమవుతున్నదని పేర్కొన్నారు. ఇదే విషయమై ప్రొఫెసర్లు హరగోపాల్, కోదండరాం సైతం మౌనం దాల్చడం వెనుక మర్మమేంటని నిలదీశారు. యూజీసీ ముసాయిదాను రాష్ట్రం ఆమోదిస్తే బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఉద్యమించేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి తన వైఖరిని వెల్లడించాలని డిమాండ్ చేశారు.
అభిప్రాయాలను పంపించాం
యూజీసీ జారీచేసిన అసంబద్ధమైన నిబంధనలను బీఆర్ఎస్ నిర్ద్వందంగా వ్యతిరేకిస్తున్నదని స్పష్టం చేశారు. ఇప్పటికే అభ్యంతరాలను యూజీసీ చైర్మన్ జగదీశ్‌కుమార్‌కు పంపించామని తెలిపారు. కేటీఆర్ నేతృత్వంలో త్వరలోనే యూజీసీ చైర్మన్, కేంద్రమంత్రులు ధర్మేంద్ర ప్రదాన్, నితీన్ గడ్కరీని కలుస్తామని చెప్పారు. దాంతో పాటు పెండింగ్‌లో ఉన్న సిద్దిపేట, సిరిసిల్ల, వేములవాడ జాతీయ రహదారిపై చర్చిస్తామని పేర్కొన్నారు.