ఆదిలాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నాయకత్వంలో తెలంగాణ పచ్చదనాన్ని సంతరించుకుంటున్నదని గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ తెలిపారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పుట్టిన రోజును పురస్కరించుకొని ఆదివారం ఆదిలాబాద్‌లో గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా చేపట్టిన 10 లక్షల మొక్కల పెంపకం కార్యక్రమానికి అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డితో కలిసి హాజరై, మొక్కలు నాటారు. అనంతరం సంతోష్‌కుమార్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే జోగు రామన్న పుట్టినరోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వరకు రోడ్డుకు ఇరువైపులా పచ్చదనం కనిపిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో 24% ఉన్న పచ్చదనాన్ని 33 శాతానికి పెంచడానికి సీఎం కేసీఆర్ హరితహారం చేపట్టారని.. ఫలితంగా రాష్ట్రంలో 4 నుంచి 5 శాతం గ్రీనరీ పెరిగిందని చెప్పారు. ఇతర రాష్ర్టాల కంటే తెలంగాణ గ్రీన్ కవరేజీలో ముందంజలో ఉందని కేంద్ర నివేదికలు వెల్లడించాయన్నారు.
నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలి
నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని ఎంపీ సంతోష్‌కుమార్ నిర్వాహకులకు సూచించారు. తాను ఏటా జిల్లాకు వచ్చి మొక్కల పెరుగుదలను పర్యవేక్షిస్తానని చెప్పారు. ఎమ్మెల్యే జోగు రామన్న ఏటా ఇక్కడే పుట్టినరోజు జరుపుకొని మొక్కలు పెరిగేలా చూడాలని కోరారు. 11 వేల మొక్కలు నాటిన సింగరేణి డైరెక్టర్ బలరాంను ఈ సందర్భంగా ఎంపీ అభినందించారు. అనంతరం ఇచ్చోడ మండలంలోని ముక్రా(కే) గ్రామాన్ని సందర్శించారు. ఎంపీ సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్ చాలెంజ్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిందని మంత్రి అల్లోల పేర్కొన్నారు. హరితహారంలో నాటిన మొక్కలకు నీళ్లు పోయడానికి ప్రభుత్వం ప్రతి పంచాయతీకి ట్రాక్టర్, ట్యాంకర్‌ను పంపిణీ చేసినట్టు వెల్లడించారు. రాష్ట్రంలో మరో 6 వేల మొక్కలు నాటితే 33% పచ్చదనం నెలకుంటుందని తెలిపారు. కాగా, గంట వ్యవధిలో 3.50లక్షల మొక్కలను నాటగా వండర్బుక్ రికార్డులో చోటు దక్కింది. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపురావు, రేఖానాయక్, దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య, ఎమ్మెల్సీ పురాణం సతీష్‌కుమార్, జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్, టీడీడీసీ చైర్మన్ లోక భూమారెడ్డి పాలొన్నారు.