హైదరాబాద్: ప్రపంచ ఫొటోగ్రఫి దినోత్సవంలో భాగంగా హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో (World photography day) ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను (Photo Exhibition) రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ (MP Santhosh Kumar) ప్రారంభించారు. మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణతో కలిసి ఎగ్జిబిషన్‌ను తిలకించారు. అనంతరం ఎంపీ సంతోష్ మాట్లాడుతూ.. ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవానికి రావడం సంతోషంగా ఉందన్నారు. తనకు ఫొటోగ్రఫీ ఒక హాబీ అని, మనం ఎమోషనల్‌గా ఉంటే తప్ప ఒక అద్భుతమైన ఫొటో రాదని చెప్పారు. ఫొటోగ్రాఫర్ల కోసం తన వంతు కృషిగా రూ.2 లక్షలు సాయంచేస్తానని ప్రకటించారు. ఫొటో జర్నలిస్టులకు భవిష్యత్‌లో అండగా ఉంటామని వెల్లడించారు.
ప్రతి సంవత్సరం ఫొటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేస్తున్నామని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. అందరి ప్రోత్సాహంతో ఫొటో ఎగ్జిబిషన్ కొనసాగుతున్నదని వెల్లడించారు. అందరూ ఫొటోగ్రాఫర్లకు అండగా నిలవాలని చెప్పారు. కాగా, ఈ ఎగ్జిబిషన్లో ఎంపీ సంతోష్ తీసిన ఫొటోలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. న్యూస్ పిక్చర్స్, తెలంగాణ పండుగలు, అభివృద్ధి విభాగాల్లో ఫొటోలను ఇందులో ప్రదర్శించారు.