హైదరాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు శరవేగంగా సాగుతున్నాయని, సీఎం కేసీఆర్ మార్గనిర్దేశంలో ప్రాజెక్టు త్వరలోనే పూర్తికానున్నదని చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి వెల్లడించారు. ప్రాజెక్టు పనులపై విధించిన స్టేను ఇటీవల సుప్రీంకోర్టు ఎత్తివేసిన నేపథ్యంలో ఎంపీ రంజిత్‌రెడ్డి శనివారం క్షేత్రస్థాయి లో పనుల పురోగతిని పరిశీలించారు. శ్రీశైలం బ్యాక్‌వాటర్ ప్రాంతమైన నాగర్‌కర్నూల్ జిల్లా అంజనగిరి రిజర్వాయర్ మొదలుకొని ఉద్దండాపూర్ రిజర్వాయర్ వరకు గల కెనాల్, టన్నెల్, సర్జ్‌పూల్, పంప్‌హౌస్‌లను పర్యవేక్షించారు.
పనుల పురోగతి గురించి నీటిపారుదల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ఎత్తిపోతల పథకం పనులు పూర్తయితే ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలు సస్యశ్యామలం అవుతాయని పేర్కొన్నారు. పనులు కొనసాగడం లేదన్న ప్రతిపక్షాల వ్యాఖ్యలు అర్థరహితమని కొట్టిపారేశారు. త్వరలో చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని ప్రజాప్రతినిధులను ప్రత్యేక వాహనాల్లో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు సందర్శనకు తీసుకెళ్తానని ఎంపీ చెప్పారు. ఈ పర్యటనలో ఎస్ఈ విజయ్‌భాస్కర్‌రెడ్డి, ఈఈలు తదితరులు ఉన్నారు.