సత్తుపల్లి టౌన్, ఫిబ్రవరి 26 : విద్యుత్తు సరఫరా విషయంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం సత్తుపల్లి పట్టణంలోని పలు వార్డుల్లో బీఎంఎఫ్టీ, టీయూఎఫ్ఐడీసీ నిధుల నుంచి రూ.35 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న కమ్యూనిటీ హాళ్లు, సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, డ్రెయిన్లకు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా ఎంపీ నామా మాట్లాడుతూ.. ఒకప్పుడు వేసవి వచ్చిందంటే పట్టణాల్లో షాపుల ముందు జనరేటర్ల మోత హోరెత్తేదని అన్నారు. నేడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కడా విద్యుత్తు సరఫరాకు అంతరాయం లేకుండా సీఎం కేసీఆర్ చర్యలు చేపట్టినట్టు చెప్పారు. పక్క రాష్ర్టాలు సమస్యలతో సతమతమవుతుంటే తెలంగాణ మాత్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నదని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుల, మతాల మధ్య చిచ్చుపెట్టి రాబోయే ఎన్నికల్లో లబ్ధిపొందాలని కుట్రలు పన్నుతున్నదని ఆరోపించారు.