హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : శీతల గిడ్డంగులకు నిధుల కేటాయింపులో తెలంగాణపై కేంద్ర సర్కారు తీవ్ర వివక్ష చూపిందని బీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు మండిపడ్డారు. ఐదేండ్ల కాలంలో బీజేపీపాలిత గుజరాత్‌కు రూ.364.67 కోట్లు కేటాయించి..తెలంగాణకు కేవలం రూ. 53.33 కోట్లు మాత్రమే ఇస్తారా? అని నిలదీశారు. గురువారం లోక్‌సభలో నామా నాగేశ్వరరావు అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయమంత్రి నరేంద్రసింగ్ తోమర్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. 2019-2020, 2021-2022లో తెలంగాణలో శీతల గిడ్డంగుల కోసం మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ (ఎంఐడీహెచ్) పథకం కింద ఒక పైసా విడుదల చేయకపోవడంపై నామా మండిపడ్డారు.
ఇది వివక్ష కాదా? అని కేంద్రాన్ని ప్రశ్నించారు. 2021-2022లో దేశంలో శీతల గిడ్డంగుల కోసం రూ.709.67 కోట్లు విడుదల చేసి, తెలంగాణకు పైసా ఇవ్వలేదని చెప్పారు. 2019-2020 లో దేశంలో గిడ్డంగుల నిర్మాణానికి రూ.1105.79 కోట్లు విడుదల చేశారని, తెలంగాణకు పైసా ఇవ్వలేదని మండి పడ్డారు. రాష్ట్రంలో 74 శీతల గిడ్డంగులు ఉన్నాయని తెలిపారు. తెలంగాణలో ఏటా సాగు విస్తీర్ణం పెరుగుతున్నదని, ఈ ఏడాది 1.65కోట్ల ఎకరాల్లో పంట సాగైందని వెల్లడించారు. ఉద్యాన పంటలు దాచుకొనేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారని, కొత్త శీతల గిడ్డంగులు నిర్మించి, రైతులను ఆదుకోవాలని నామా నాగేశ్వర్రావు కోరారు.