హైదరాబాద్: సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో తన వ్యక్తిత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ హీరో అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలపై భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Kiran kumar Reddy) స్పందించారు. అల్లు అర్జున్ మానవత్వం మరిచినట్లుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరో రాసిన నోట్‌ను ప్రెస్మీట్లో చదివారని విమర్శించారు. అందులో ఉన్నది చదవడం విడ్డూరంగా ఉందన్నారు. అల్లు అర్జున్ నిజ జీవితంలోనూ నటిస్తున్నట్లే ఉందని మండిపడ్డారు. ఆయన నటించిన సినిమాకు కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి అండగా ఉండి రేట్లు పెంచారని చెప్పారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి వాస్తవాలు చెప్పారని తెలిపారు. సినిమాలోనే కాదు.. నిజ జీవితంలోనూ బాధ్యతగా ఉండాలంటూ బన్నీకి చురకలంటించారు.
థియేటర్లో ఒక తల్లి చనిపోయినా కూడా మానవత్వం లేకుండా రూఫ్‌టాప్ ఓపెన్ చేసి చేతులు ఊపుకుంటూ వెళ్లిపోయిన ఆ హీరో ఏం మనిషి..? మృత్యువుతో పోరాడుతున్న బాలుడిని ఆ హీరోనే కాదంటూ అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే పోలీసుల అనుమతి లేకుండానే థియేటర్‌కు వెళ్లి, రోడ్‌షో, ర్యాలీ నిర్వహించినట్టు వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమని అల్లు అర్జున్ శనివారం స్పష్టంచేశారు. పోలీసుల అనుమతి తీసుకున్నామని థియేటర్ యాజమాన్యం చెబితేనే అక్కడికి వెళ్లానని తెలిపారు. శాసనసభలో సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యల తర్వాత రాత్రి 8గంటల సమయంలో హైదరాబాద్‌లోని తన నివాసంలో అల్లు అర్జున్ మీడియా సమావేశం నిర్వహించారు. ఎక్కడా ముఖ్యమంత్రి పేరు ప్రస్తావించకుండానే ఆయన చేసిన ఆరోపణలకు సమాధానం ఇచ్చారు. తొక్కిసలాట ఘటనలో తన వ్యక్తిత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. థియేటర్ వద్ద జరిగిన ఘటన చాలా దురదృష్టకరమన్నారు. బాధిత కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నానని, చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
థియేటర్ పరిసరాల్లో ఎలాంటి రోడ్‌షో నిర్వహించలేదని అల్లు అర్జున్ తెలిపారు. తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన విషయం తనకు మరుసటి రోజు వరకు తెలియదని చెప్పారు. తనపై కేసు నమోదు కావడం వల్ల నేరుగా వెళ్లి బాధిత కుటుంబాన్ని కలవలేకపోయానని తెలిపారు. ‘థియేటర్ వాళ్లు పర్మిషన్ తీసుకున్నామని చెబితేనే నేను అక్కడకు వెళ్లాను. పోలీసులే అక్కడకు వచ్చిన జనాల్ని నియంత్రిస్తూ నా కారు లోపలికి వెళ్లేలా చూశారు. పోలీసులు అక్కడకు వచ్చారంటే పర్మిషన్ ఇచ్చినట్ట్లే కదా! అభిమానులు చుట్టుముట్టడంతో నా కారు ముందుకు కదల్లేదు. నేను అభివాదం చేస్తే రద్దీ క్లియర్ అవుతుందని పోలీసులు చెప్పడంతోనే చేయి ఊపుతూ ముందుకెళ్లాను’ అని అల్లు అర్జున్ చెప్పారు. సినిమా చూస్తున్నప్పుడు పోలీసు అధికారులెవ్వరూ తనను కలవలేదని, థియేటర్ యాజమాన్యం వచ్చి బయట రద్దీ పెరుగుతున్నదని చెబితే తాను బయటకు వచ్చానని తెలిపారు.