పోచారం,జనవరి21 : పేదల స్థలాలను పరిశీలించడానికి వెళ్లిన మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అక్కడే ఉన్న ఆక్రమణదారులపై చేయిచేసుకున్నారు. పోచారం మున్సిపాలిటీ పరిధిలోని కొర్రెముల రెవెన్యూ పరిధిలోని ఏకశిలానగర్ ప్లాట్లను కొంతమంది ఆక్రమించడానికి ప్రయత్నిస్తూ, భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, తమకు న్యాయంచేయాలని బాధితులు సోమవారం ఎంపీ ఈటల రాజేందర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. దీంతో ఈటల రాజేందర్ బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మంగళవారం అక్కడకు చేరుకొని స్థలాలను పరిశీలించారు.
అదే సమయంలో ఆక్రమణదారునికి సంబంధించిన ఆరుగురు వ్య క్తులు మద్యం సేవిస్తూ అక్కడ కనిపించారు. వారిలో ఒకరిపై ఎంపీ ఈటల రాజేందర్ స్వయంగా చేయిచేసుకున్నారు. దీంతో మిగతావారిని పట్టుకొని కార్యకర్తలు చితకబాదారు. వీరిలో నలుగురు అక్కడినుంచి పారిపోగా, మరో ఇద్దరు ఉపేందర్, రఫీక్ కార్యకర్తలకు చిక్కడంతో చితకబాదారు. దీంతో పోచారం పోలీసులు అక్కడకు చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం మల్కాజిగిరి ఏసీపీ చక్రపాణి సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. తమపై ఎంపీ ఈటల, ఆయన అనుచరులు దాడి చేశారని ఉపేందర్ ఫిర్యాదుచేయడంతో పోలీసులు కేసు నమోదుచేశారు.
హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర రెవెన్యూ శాఖలో 93 మందికి నాయబ్ తహసీల్దార్లుగా పదోన్నతి కల్పించారు. ఈ మేరకు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. డీపీసీ సూచనల మేరకు 6 జోన్లలోని సీనియర్ అసిస్టెంట్లు, అడ్‌హక్ నాయబ్ తహసీల్దార్లకు పదోన్నతులు కల్పించినట్టు వెల్లడించారు.