MP Etala Rajender | హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కండ్లు నెత్తికెక్కి మాట్లాడుతున్నారని బీజేపీ మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. లగచర్ల ఘటనపై సీఎం రేవంత్రెడ్డి, సర్కారు వైఖరిని తప్పుబట్టారు. భూములు తీసుకోవడానికి వస్తే అధికారులను తన్ని తరమండంటూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు పిలుపునిచ్చిన రేవంత్రెడ్డి.. అధికారంలోకి రాగానే అదే ప్రజల భూములను గుంజుకుంటున్నారని ధ్వజమెత్తారు. లగచర్ల సహా పరిసర గ్రామాల్లో కొందరు దళారులు, మధ్యవర్తులు అసైన్డ్ భూములు పొందిన వారిని బెదిరింపులకు పాల్పడుతున్నారని, పట్టా భూములు కలిగి ఉన్నవారి నుంచి బలవంతంగా భూములు సేకరించాలని ప్రయత్నించారని ఆరోపించారు. రూ.40 లక్షల విలువైన భూమిని కేవలం రూ.10 లక్షలకే గుంజుకునే ప్రయత్నం చేశారని తెలిపారు. స్థానికులు తమ గ్రామాలను వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ రాష్ట్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారని తెలిపారు.
మాజీ ఎమ్మెల్యే పట్నం నరేంద్రెడ్డి మాట్లాడిన దాంట్లో తప్పేమున్నదని ఈటల ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్లు కాకపోతే ఎవరు ప్రజలకు అండగా ఉంటారని నిలదీశారు. రేవంత్రెడ్డి వందలసార్లు అలాగే మాట్లాడితే.. ఆయనను ఆనాడు అరెస్తు చేశారా? అని ప్రశ్నించారు. ఇంత బర్నింగ్ ఇష్యూ జరుగుతున్నప్పుడు అసలు అధికారులు గ్రామంలోకి ఎందుకు వెళ్లారని నిలదీశారు. అతి తక్కువ కాలంలోనే ప్రజల చేత ఛీకొట్టించుకున్నది రేవంత్ సర్కారే అవుతుందని చెప్పారు. హైడ్రా పేరుతో ఇండ్లు కూలగొడుతూ ప్రజల జీవితాలతో చెలగాటమాడటం దుర్మార్గమని ఆవేదన వ్యక్తంచేశారు. 1,500 మంది పోలీసులు 4 గ్రామాలపై పడి రాత్రికి రాత్రే పలువురిని అరెస్ట్ చేసి హింసించారని ఆరోపించారు. ప్రజల భూములు సేకరించాలనుకున్నప్పుడు ప్రత్యామ్నాయం చూపించాల్సిందేనని స్పష్టం చేశారు.