మాగనూరు, నవంబర్ 14 : ఇసుక ను అక్రమంగా తరలించొద్దని కాంగ్రెస్ నాయకుడు టిప్పర్లను అడ్డుకున్నాడు. ఈ ఘటన నారాయణపేట జిల్లాలో చోటుచేసుకున్నది. నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం పేరుతో రాఘవ కన్స్ట్రక్షన్ మాగనూరులోని పెద్ద వాగు నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.
ఇసుక తరలిస్తున్న స్థలంలో తన పొలం ఉన్నదని, రవాణా ఇలాగే కొనసాగితే పంటల కోసం వేసుకున్న బోర్లు వట్టిపోతాయని, కలెక్టర్, అధికారులు, పోలీసుల దృష్టికి తీసుకెళ్లి నా ఎవరూ పట్టించుకోవడం లేదని మాజీ సర్పంచ్ తనయుడు, కాంగ్రెస్ నాయకుడు వాకిటి శ్రీను వాపోయాడు. శుక్రవారం శ్రీను పురుగుల మందు డబ్బా చేత పట్టుకొని ఇసుక తరలింపును అడ్డుకొన్నాడు. పోలీసులు, నాయకులు వాగు వద్దకు చేరుకొని శ్రీనును సముదాయించే ప్రయత్నం చేశారు. వినకపోవడంతో ఖాళీ టిప్పర్లను వాగు నుంచి తిప్పి పంపించేశారు.