ఖైరతాబాద్, జూన్ 21: బీసీల రిజర్వేషన్ల సాధన కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉద్యమిస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీహార్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ సామాజిక రిజర్వేషన్లు 50 శాతం దాటడం సుప్రీం కోర్టు తీర్పునకు విరుద్ధమని, ఆ రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన సామాజిక రిజర్వేషన్లను రద్దు చేస్తున్నట్టు పాట్నా హైకోర్టు తీర్పు ఇవ్వటం బాధాకరం అన్ని అన్నారు. ఎలాంటి గణంకాలు, కమిషన్ సిఫారసులు లేకుండా కేంద్రం తీసుకొచ్చిన ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్‌కు అనుకూలమైన తీర్పులు ఇస్తున్న కోర్టులు బడుగు, బలహీనవర్గాల రిజర్వేషన్లకు భిన్నంగా తీర్పునివ్వటం సమంజసం కాదని వ్యాఖ్యానించారు. అగ్రవర్ణాలకు పది శాతం రిజర్వేషన్లు కల్పించి మొత్తం 60 శాతం సీలింగ్ దాటినప్పుడులేని అభ్యంతరం బీహార్ ప్రభుత్వం శాస్త్రీయంగా నిర్వహించిన కులగణనపై ఎందుకు వివక్షచూపుతున్నారని ప్రశ్నించారు. దీనిపై ఎన్డీయే భాగస్వామ్య పార్టీలు జేడీయూ, టీడీపీ కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని తెలిపారు. సామాజిక రిజర్వేషన్లు రక్షించుకోవడానికి తొలుత దేశవ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టి, ఆగస్టు చివరి వారంలో ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో పది లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని వెల్లడించారు. సమావేశంలో బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేశ్‌చారి, కన్వీనర్ ఉప్పరి శేఖర్సగర, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్, యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు కనకాల శ్యామ్ కురుమ, బీసీ ఫెడరేషన్ అధ్యక్షుడు ఎస్ దుర్గాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్, జూన్21 (నమస్తే తెలంగాణ): బీసీ రిజర్వేషన్లు 65 శాతానికి పెంచడాన్ని రద్దు చేస్తూ బీహార్ హైకోర్టు తీర్పు ఇవ్వడం సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య తెలిపారు. ఈడబ్ల్యూఎస్‌కు 10 శాతం కల్పించిన సందర్భంలో రిజర్వేషన్లు 50 శాతానికి మించి ఉండడం సబబేనని సుప్రీంకోర్టు ఫుల్‌బెంచ్ తీర్పునిచ్చిందని గుర్తుచేశారు. ఆ తీర్పునకు విరుద్ధంగా పాట్నా హైకోర్టు తీర్పునివ్వడం అన్యామని వెల్లడించారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో బీహార్ ముఖ్యమంత్రి భాగస్వామి అయిన నేపథ్యంలో వెంటనే రాజ్యాంగ సవరణ చేసి బీసీ రిజర్వేషన్లను పెంచేలా ఒత్తిడి తీసుకురావాలని, లేదంటే మద్దతును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బీహార్ ముఖ్యమంత్రికి లేఖను రాశారు.