హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 10 (నమస్తే తెలంగాణ ) : జీహెచ్ఎంసీలో టీడీఆర్ (ట్రాన్స్ఫర్ ఆఫ్ డెవలప్మెంట్ రైట్స్) సర్టిఫికెట్ల జారీ ప్రక్రియలో ఎట్టకేలకు కదలిక వచ్చింది. నాలా విస్తరణ, ఎస్ఆర్డీపీ, ఎస్ఎన్డీపీ, రహదారుల విస్తరణ తదితర ప్రాజెక్టులకు అవసరమైన భూమి, ఆస్తుల సేకరణకు నష్టపరిహారంగా చెల్లించే నగదుకు బదులుగా ప్రవేశపెట్టిన టీడీఆర్ గత కొద్ది నెలలుగా నిలిపివేశారు. కొత్త టీడీఆర్‌లు రాకపోవడం, మార్కెట్లో ఇప్పటికే ఉన్న టీడీఆర్‌లకు విపరీతమైన డిమాండ్ నేపథ్యంలో బ్లాక్ మార్కెట్‌పై ఈ నెల 7న నమస్తే తెలంగాణలో ‘జీహెచ్ఎంసీలో నిలిచిన టీడీఆర్’ శీర్షికన ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దీనిపై స్పందించిన జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి టౌన్‌ప్లానింగ్ అధికారులతో సమీక్ష జరిపారు. అధికారుల వద్ద పెండింగ్‌లో ఉన్న టీడీఆర్‌లను సోమవారం తెప్పించుకున్న కమిషనర్ కొన్నింటిని మంజూరు చేశారు. వివాదరహితంగా ఉన్నవి, చెరువులు, ఎఫ్టీఎల్లో ఉన్నవి మినహా ఇతర వాటిని రిలీజ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కాగా టీడీఆర్ మంజూరు నిరంతర ప్రక్రియ అని, నిలిపివేయవద్దని ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడ్డారు.