హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ) : టీచర్లు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ టీచర్స్ ఆర్గనైజేషన్స్(జాక్టో) డిమాండ్ చేసింది. సమస్య పరిష్కారం కోసం ఫిబ్రవరిలో ఆందోళన బాట పట్టనున్నట్టు జాక్టో చైర్మన్ జీ సదానందంగౌడ్ ప్రకటించారు. మండల, జిల్లా స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు భారీ ఉద్యమాన్ని చేపడుతామని వెల్లడించారు.
శనివారం కాచిగూడలోని ఎస్టీయూ భవన్లో జాక్టో నేతలు అత్యవసరంగా సమావేశమయ్యారు. టీచర్లంతా పోరాటానికి సిద్ధం కావాలని పిలుపు ఇచ్చారు. మ్యానిఫెస్టో హామీలను అమలుపర్చడంలో సర్కార్ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.
ఆరు నెలల్లో పీఆర్సీ సిఫారసులు అమలుచేస్తామని మాట తప్పారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బకాయిపడ్డ ఐదు డీఏలు విడుదల చేయాలని, హెల్త్‌కార్డులు జారీచేయాలని, సీపీఎస్ రద్దుచేయాలని డిమాండ్ చేశారు. నెలకు రూ. 1,500 కోట్ల పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని, మాడల్ స్కూల్టీచర్లకు 010 పద్దు ద్వారా వేతనాలు, కేజీబీవీ, యూఆర్హెచ్ టీచర్లకు సమ్మెకాలపు వేతనాలు చెల్లించాలని కోరారు. ఈ సమావేశంలో జాక్టో ప్రధాన కార్యదర్శి కే కృష్ణుడు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.