హైదరాబాద్,జూలై 21 (నమస్తే తెలంగాణ): దేశంలో జాతీయ విద్యావిధానం-2020కు వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమించాలని ఎస్ఎఫ్ఐ మాజీ జాతీయ అధ్యక్షుడు అరుణ్‌కుమార్ పిలుపునిచ్చారు. బీజేపీ జాతీయ విద్యావిధానం పేరుతో దేశంలో విద్య కార్పొరేటీకరణ, కాషాయికరణ, వ్యాపారీకరణ కోసం పూనుకున్నదని విమర్శించారు. పేద విద్యార్థులకు విద్యను మరింత దూరం చేసే కుట్రలో భాగంగానే జాతీయ విద్యావిధానం తీసుకుని వచ్చిందని పేర్కొన్నారు.
సోమవారం ఐద్వా రాష్ట్ర కార్యాలయంలో ఎస్ఎఫ్ఐ కేంద్ర కమిటీ సభ్యురాలు ఎం మమత అధ్యక్షతన జరిగిన ‘డైలాగ్ విత్ అరుణ్‌కుమార్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో జాతీయ విద్యావిధానం పేరుతో ప్రజాస్వామిక హక్కులపై బీజేపీ దాడి చేస్తుందని ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ ఎజెండాను విద్యావిధానంలో అమలు చేసే చర్యలకు పాల్పడుతుందని విమర్శించారు. విద్యార్థులు నిరంతరం వారి చదువులతోపాటు రాజకీయాలను కూడా అధ్యయనం చేయాలని సూచించారు.