అణగారిన వర్గాల కోసమే సీఎం కేసీఆర్ ప్రకటన
కేసీఆర్ దళిత వ్యతిరేకి అయితే దళితబంధు ఎందుకు తెస్తారు?
రాజ్యసభ, న్యాయవ్యవస్థలో రిజర్వేషన్లు ఎందుకులేవు?
మాజీ మంత్రి మోత్కుపల్లి ప్రశ్న
హైదరాబాద్, జనవరి 4 : అణగారిన వర్గాలకు న్యాయం జరగాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ అభిమతమని, అందులో భాగంగానే రాజ్యాంగంపై చర్చ లేవనెత్తారని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. సీఎం కేసీఆర్కు జాతీయస్థాయిలో పేరు రావడం ఇష్టంలేకనే బీజేపీ నేతలు పథకం ప్రకారం దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం హైదరాబాద్లోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ దళిత వ్యతిరేకే అయితే దేశంలో ఎవరూ అమలు చేయని దళితబంధు పథకాన్ని ఎందుకు తెస్తారని ప్రశ్నించారు. పరిశ్రమల్లో, మార్కెట్ కమిటీల్లోనూ రిజర్వేషన్లు ఎందుకు అమలు చేస్తారని బీజేపీ నేతలను నిలదీశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నోరు అదుపులోపెట్టుకోవాలని హెచ్చరించారు. రాజ్యాంగాన్ని మార్చాలని వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడే జస్టిస్ వెంకటాచలయ్య కమిటీ వేశారని, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ కూడా రాజ్యాంగంలో మార్పులు చేయాలని సూచించిన విషయాన్ని మోత్కుపల్లి నర్సింహులు గుర్తుచేశారు.
జ్యుడీషియరీలో రిజర్వేషన్లు ఎందుకు లేవు?
దళితులను న్యాయవ్యవస్థకు దూరంగా ఉంచారని, న్యాయమూర్తుల ఎంపికలో రిజర్వేషన్లు లేవని మోత్కుపల్లి పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థలో రిజర్వేషన్లు ఉంటే కోర్టుల్లో న్యాయమూర్తులుగా ఎస్సీలకు అవకాశం దక్కేదని అన్నారు. బీజేపీ నేతలు సన్నాసుల్లా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాజ్యాంగాన్ని ఇప్పటికే అనేకసార్లు సవరించారని, ఎవరికి బలముంటే వారికి అనుకూలంగా మార్చుకొంటూ అంబేద్కర్ స్ఫూర్తిని దెబ్బతీశారని విమర్శించారు. సీఎం కేసీఆర్ ఏది చేసినా ఆలోచించే చేస్తారనే విషయాన్ని దళిత, గిరిజనులు అర్థం చేసుకోవాలని సూచించారు. రాష్ర్టాల హక్కులను కాలరాస్తూ కేంద్రం పెత్తనం చెలాయిస్తుండటం వల్లే సీఎం కొత్త రాజ్యాంగం కావాలన్నారని వివరించారు.