Tragedy | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఓ నర్సు కాన్పు చేసింది. కానీ ప్రసవం అనంతరం తల్లీబిడ్డ మృతిచెందారు.
వివరాల్లోకి వెళ్తే.. గుండాల మండలం శంభునిగూడెం గ్రామానికి చెందిన గర్భిణి వనజ (20)కు పురిటినొప్పులు రావడంతో గుండాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆ సమయంలో ఆస్పత్రిలో వైద్యులు అందుబాటులో లేరు. దీంతో అక్కడ ఉన్న నర్స్ సాధారణ ప్రసవం చేసింది. కానీ కాన్పు తర్వాత శిశువు అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఇది గమనించిన కుటుంబసభ్యులు ఇల్లెందు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ నవజాత శిశువును పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లుగా తెలిపారు.
మరోవైపు కాన్పు అనంతరం తల్లికి తీవ్ర రక్తస్రావం కావడంతో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స పొందుతూ ఆమె కూడా మరణించింది.ఈ ఘటనపై బాధిత కుటుంబం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ కుమార్తె, మనమడు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.