శివ్వంపేట, సెప్టెంబర్ 12 : వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని భావించిన తల్లి కన్న కూతురిని హత్య చేసిన ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం శబాష్‌పల్లికి చెందిన బొట్టు మమత తన కూతురు తనుశ్రీ(2)తో కలిసి అదే గ్రామానికి చెందిన షేక్ ఫయాజ్ వెంట మే నెల 21న వెళ్లిపోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో భాగంగా గురువారం వీరిని గుంటూరులో అదుపులోకి తీసుకున్నారు. మమత కూతురు కనిపించకపోవడంతో ఏం చేశారని పోలీసులు విచారించగా తమ సంబంధానికి అడ్డుగా ఉందని, శబాష్‌పల్లి శివారులో చంపి పాతిపెట్టామని ఒప్పుకున్నారు. ఘటనా స్థలాన్ని మెదక్ జిల్లా తూప్రాన్ డీఎస్పీ నరేందర్‌గౌడ్, సీఐ రంగకృష్ణ, ఎస్సై మధుకర్‌రెడ్డి పరిశీలించారు. శవాన్ని బయటకు తీసి తహసీల్దార్ కమలాద్రి, డాక్టర్ నవీన్ ఆధ్వర్యంలో పోస్టుమార్టం చేయించారు.
మహిళా ఉద్యోగిపై లైంగిక వేధింపులు
జగిత్యాల కలెక్టరేట్, సెప్టెంబర్ 12 : జగిత్యాల జిల్లా పెగడపెల్లి తహసీల్దార్ రవీందర్ నాయక్‌పై కేసు నమోదు చేసినట్టు జగిత్యాల సీఐ కరుణాకర్ తెలిపారు. జగిత్యాలలోని ఓ వార్డులో ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలనను రవీందర్ నాయక్‌కు అప్పగించారు. ఈ క్రమంలో సహాయకారిగా ఉన్న మహిళా ఉద్యోగి తనపై తహసీల్దార్ అసభ్యకరంగా ప్రవర్తించాడని, బలవంతంగా కారులో ఎక్కించుకెళ్లి లైంగికదాడి చేశాడని చేసిన ఫిర్యాదు మేరకు తహసీల్దార్‌పై కేసు నమోదైంది.