సిద్దిపేట: అనుమానమే నిజమైంది. తన బిడ్డ అపహరణకు గురైందని ఫిర్యాదు చేసిన తల్లే.. ఆ చిన్నారిని బలితీసుకున్నది. బాలుడిని తానే బావిలో పడేశానని ఒప్పుకున్న ఘటన సిద్దిపేట (Siddipet) జిల్లా అప్పనపల్లిలో చోటుచేసుకున్నది. దుబ్బాక మండలం అప్పనపల్లిలో నివాసం ఉంటున్న శ్రీమాన్, కవిత దంపతులకు రెండు నెలల వయస్సున్న కుమారుడు ఉన్నాడు. ఈ నెల 17న మిరుదొడ్డి మండలం రుద్రారంలో ఉన్నా తన సోదరి ఇంటి వద్ద పని ఉందని శ్రీమాన్ వెళ్లాడు. ఈ క్రమంలో కవిత తన రెండు నెలల కుమారుడితో ఉంటుంది. బుధవారం రాత్రి తన కుమారుడిని ఎత్తుకుని ఆరుబయట ఉండగా, గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి మాయ మాటలు చెప్పి, ఒడిలో నుంచి పసికందును అపహరించుకేళ్లారని తెలిపింది. ఈ విషయంపై కవిత తన భర్త శ్రీమాన్‌తో కలిసి దుబ్బాక పోలీసు స్టేషన్లో గురువారం ఉదయం ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన దర్యాప్తు ప్రారంభించారు.
ఇందులో భాగంగా కవితను తమదైన స్టైల్లో విచారించగా అసలు విషయం తేలింది. అదేరోజు అప్పనపల్లి శివారు బావిలో బాబును పడేసినట్లు అంగీకరించింది. దీంతో క్రేన్ సహాయంతో బాబు మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. నిందితురాలిని సిద్దిపేట మహిళా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. భార్యాభర్తల మధ్య నెలకొన్న గొడవల కారణంగానే తమ పసికందును హతమార్చి, బావిలో పడేసినట్లు పోలీసు వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.