భీమదేవరపల్లి, అక్టోబర్ 9: క్యాన్సర్ బారిన పడిన కొడుకు ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తుండటంతో ఆ తల్లి తట్టుకోలేకపోయింది. తీవ్ర మనస్తాపం చెందిన ఆ మాతృమూర్తి అనారోగ్యంతో మంచం పట్టింది. కొడుకు మృతిని తట్టుకోలేననుకుందో ఏమో కానీ.. అతడి కంటే ముందే కన్నుమూసింది. తల్లి లేకపోతే తననెవరు పట్టించుకుంటారనుకున్నాడో ఏమో.. ఆమె మరణించిన గంట సేపటికే కొడుకు తనువు చాలించాడు. ఈ హృదయ విదారక ఘటన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో బుధవారం చోటుచేసుకుంది. చిదురాల లక్ష్మయ్యకు భార్య శోభ (48), ఇద్దరు కుమారులు సందీప్, సాయికిరణ్ (28), కూతురు దివ్య ఉన్నారు.
భార్యాభర్తలిద్దరు కూలి పని చేసి కుటుంబాన్ని పోషిస్తూ కూతురు వివాహం చేశారు. పెద్ద కొడుకు సందీప్ కూడా కూలి పని చేస్తున్నాడు. చిన్న కొడుకు సాయికిరణ్ ముల్కనూరులోనే కొంతకాలం బైక్ మెకానిక్ పని నేర్చుకునేందుకు వెళ్లేవాడు. ఇంతలో సాయికిరణ్ అస్వస్థతకు గురికావడంతో చికిత్స కోసం వరంగల్లోని ఎంజీఎం దవాఖానకు తీసుకెళ్లారు. నిత్యం గుట్కాలు తినడం వల్ల క్యాన్సర్ సోకిందని, ఆపరేషన్ చేయాలని వైద్యులు చెప్పారు. ఏడాది క్రితం పేగు ఆపరేషన్ చేసినా నయం కాకపోవడంతో హైదరాబాద్లోని ఎంఎన్జే దవాఖానకు తరలించారు. అక్కడ కీమో థెరపీ చేసినా ప్రయోజనం లేకపోవడంతో ఇంటికి తీసుకొచ్చారు. రోజురోజుకూ కొడుకు ఆరోగ్యం క్షీణిస్తుండటంతో తల్లి శోభ దిగులు పెట్టుకున్నది. దీంతో ఆమె కూడా అనారోగ్యం బారిన పడి బుధవారం ఉదయం కన్నుమూసింది. ఆమె మరణించిన గంటసేపటికే సాయికిరణ్ కూడా మృతిచెందాడు. ఇంటి ముందు తల్లి, కొడుకుల మృతదేహాలను చూసిన గ్రామస్థులు చలించిపోయారు. రెక్కాడితేగాని డొక్కాడని చిదురాల లక్ష్మయ్య కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.