హైదరాబాద్: కర్నూల్ జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదం (Kaveri Travels Accident) తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో 19 మంది సజీవ దహనమయ్యారు. మరో 21 మంది క్షేమంగా బయటపడ్డారు. అయితే ఈ ప్రమాదంలో దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో జరుపుకుందాని హైదరాబాద్ వచ్చిన పలువురు సజీవదహనమయ్యారు. కర్నూలు జిల్లాకు చెందిన గొళ్ల రమేశ్ కుటుంబం అగ్నికి ఆహుతయ్యింది. అదేవిధంగా యాదిద్రి జిల్లాకు చెందిన ఓ యువతి కూడా మృతిచెందింది.
ఆంధ్రప్రదేశ్ కు చెందిన రాము అనే వ్యక్తి బెంగళూరులో ఉంటున్నారు. దీపావళి పండుగను సంగారెడ్డి పటాన్చెరులోని కృషి డిఫెన్స్ కాలనీలో నివాసం ఉండే తమ బంధువుల ఇంట్లో జరుపుకోవడానికి తన తల్లితో కలిసి వచ్చారు. గురువారం రాత్రి 9.30 గంటల సమయంలో తల్లీ కొడుకులిద్దరు కావేరి ట్రావెల్స్ బస్సులో బెంగళూరుకు బయల్దేరారు. ఈ క్రమంలో చిన్నటేకూరు వద్ద ఓ బైకును ఢీకొట్టడంతో బస్సులో మంటలు చెలరేగాయి. దీంతో బస్సు పూర్తిగా దగ్ధమయింది. దీంతో తల్లి కొడుకులు సజీవదహనమయ్యారు.
యాదాద్రి జిల్లా గుండాల మండలం వస్తకొండూరుకు చెందిన అనూష రెడ్డి.. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నది. దీపావళి పండుగను స్వగ్రామంలో తల్లిదండ్రులతో కలిసి జరుపుకున్న ఆమె.. గురువారం రాత్రి బెంగళూరుకు తిరిగిపయణమయ్యారు. లక్డీకపూల్లో కావేరి ట్రావెల్స్ బస్సు ఎక్కిన ఆమె కూడా మృతిచెందింది. అనూష మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీవరవుతున్నారు.