హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వంతో సమానంగా తెలంగాణలో కూడా ‘ఆపరేషన్ కగార్’ను కొనసాగిస్తున్నామని, మావోయిస్టులతో చర్చలకు ఎక్కడా తావులేదని డీజీపీ జితేందర్ చెప్పారు. గతంలో జరిగిన చర్చల వల్ల ఏం ఉపయోగం జరిగిందని ప్రశ్నించారు. చర్చలు, మావోయిస్టుల విషయంలో ఎక్కడా రాజీ పడటంలేదని చెప్పారు. సీపీఐ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు, మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల కిషన్‌జీ అలియాస్ కోటేశ్వరరావు భార్య పోతుల పద్మావతి అలియాస్ సుజాతక్క అలియాస్ మైనక్క ఇటీవల మహబూబ్‌నగర్ పోలీసుల ముందు అనారోగ్య కారణాలతో లొంగిపోయారు. ఈ క్రమంలో ఆమెను డీజీపీ జితేందర్, ఇంటెలిజెన్స్ డీజీ శివధర్‌రెడ్డి, ఎస్ఐబీ ఐజీ సుమతి శనివారం మీడియా ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా రూ.25 లక్షల డీడీని ఆమెకు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీజీపీ జితేందర్ మాట్లాడుతూ.. ఈ ఏడాది ఇప్పటికే 404 మంది మావోయిస్టులు లొంగిపోయారని చెప్పారు. వీరిలో నలుగురు రాష్ట్ర కమిటీ సభ్యులు, ఒక డివిజనల్ కమిటీ కార్యదర్శి, 8 మంది డివిజనల్ కమిటీ సభ్యులు, 34 మంది ఏరియా కమిటీ సభ్యులు ఉన్నారని తెలిపారు. గత 20 నెలల కాలంలో సుమారు 34 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లో మృతి చెందారని చెప్పారు.
అజ్ఞాతంలో 78 మంది
ప్రస్తుతం సీపీఐ మావోయిస్టు పార్టీలో తెలంగాణకు చెందిన మావోయిస్టులు 78 మంది వివిధ రాష్ర్టాల కమిటీల్లో ఉంటూ నేటికీ అజ్ఞాతంలో ఉన్నారని డీజీపీ జితేందర్ తెలిపారు. మొత్తం 15మంది కేంద్ర కమిటీ సభ్యుల్లో 10 మంది తెలంగాణకు చెందిన వారే ఉన్నారని చెప్పారు. ఇక తెలంగాణ రాష్ట్ర కమిటీలో 71 మంది ఉండగా.. వారిలో 12 మంది తెలంగాణ వారు కాగా, మిగిలిన వారంతా ఇతర రాష్ర్టాలకు చెందిన మావోయిస్టులేనని చెప్పారు. ఈ సందర్భంగా తెలంగాణకు చెందిన మావోయిస్టులు స్వరాష్ట్రంలో జ రుగుతున్న అభివృద్ధిలో భాగస్వాములయ్యేందుకు లొంగిపోవాలని డీజీపీ పిలుపునిచ్చారు.
వీడిన 43 ఏండ్ల అజ్ఞాతం..
ఇంటర్ చదువుతున్న రోజుల్లోనే ఉద్యమంలో చేరిన పోతుల పద్మావతి అలియాస్ సుజాతక్క దాదాపు 43 ఏండ్లపాటు అజ్ఞాతంలో గడిపారు. 62 ఏండ్ల సుజాతక్క స్వస్థలం జోగులాంబ గద్వాల జిల్లా, గట్టు మండలం, పెంచికల్పాడు గ్రామం. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలిగా, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సెక్రటేరియట్ సభ్యురాలిగా, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ పరిధిలోని దక్షిణ సబ్‌జోనల్ బ్యూరో కార్యదర్శిగా, జనతన్ సరార్ (రెవల్యూషనరీ పీపుల్స్ కమిటీ) బాధ్యురాలిగా ఆమె పనిచేశారు. ఆమె తండ్రి తిమ్మారెడ్డి పెద్దకాసు రైతు కుటుంబానికి చెందినవారు. తల్లి వెంకమ్మ, పోస్‌మాస్టర్ అయిన తండ్రి.. 1983లో చనిపోయారు. ఆమెకు ఐదుగురు తోబుట్టువులలో ముగ్గురు సోదరులు, ఒక సోదరి ఉన్నారు. ఆమె పెద్దన్న పొతుల శ్రీనివాస్‌రెడ్డి కూడా 1982లో 2 నెలలు పీపుల్స్‌వార్ గ్రూప్‌లో పనిచేశారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా పనిచేసిన సీనియర్ నాయకుడు మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ ప్రహ్లాద్ అలియాస్ కిషన్‌జీని సుజాతక్క 1984లో పెండ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె ఉంది. 2011లో కిషన్‌జీ ఎదురు కాల్పుల్లో మరణించారు.