మొయినాబాద్, జనవరి 21: బడా రాజకీయ నాయకులతో తనకు పరిచయాలున్నాయని, సీబీఐ, ఈడీ వంటి సెంట్రల్ ఏజెన్సీల వద్ద పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించగలనని, కాంట్రాక్టులు ఇప్పించగలనని నమ్మిస్తూ మోసాలకు పాల్పడిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బుర్హానుద్దీన్‌ను మొయినాబాద్ పోలీసులు పట్టుకున్నారు. రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. వేర్వేరు పేర్లతో చలామణి అవుతున్న బుర్హానుద్దీన్‌పై 2009 నుంచి పలు పోలీస్స్టేషన్లలో పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో కాకుండా ఢిల్లీ, జార్ఖండ్ రాష్ర్టాలలో కూడా అతనిపై కేసులున్నాయి. కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీకి తాను పీఏనంటూ జార్ఖండ్‌లో మోసం చేసేందుకు ప్రయత్నించాడు. తాను పీఎంవోలో పనిచేస్తానని ఓ ఐఏఎస్ అధికారిని నమ్మించి అతడిని సీబీఐ విచారణ నుంచి తప్పిస్తానని రూ.1.50 కోట్లు తస్కరించాడు. ఓ పారిశ్రామికవేత్తకు నకిలీ ఈడీ నోటీసులు పంపి మోసగించేందుకు ప్రయత్నించాడు. వీటన్నింటిపై కేసులు నమోదు కాగా, దర్యాప్తు కొనసాగుతున్నది.