హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): మత్తు పదార్థాల వాడకంలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. వీటిని వినియోగిస్తున్న వారిలో ఎక్కువ మంది స్వలింగ సంపర్కులు (గేలు) ఉంటున్నట్టు సమాచారం. ఇటీవల పట్టుబడిన నిందితులపై ఎక్సైజ్ అధికారులు జరిపిన విచారణలో ఈ విషయం వెల్లడైనట్టు తెలుస్తున్నది. గే సర్కిళ్లలో మత్తు పదార్థాల వాడకం పెరుగుతున్నదని, తమ సర్కిళ్లను పెంచుకొనేందుకు డ్రగ్స్‌ను ఎరగా ఉపయోగిస్తున్నామని నిందితులు చెప్పినట్టు వినికిడి. నిరుడు నవంబర్‌లో కూకట్‌పల్లిలోని ఓ అపార్ట్మెంట్లో గే రేవ్‌పార్టీ జరుగుతుండగా పోలీసులు పట్టుకొన్నారు. ఆ పార్టీలో పాల్గొన్న వారంతా మగవారే.
‘విచ్చలవిడి’ స్థితిలో ఉన్న వారి వద్ద పెద్ద సంఖ్యలో కండోమ్ ప్యాకెట్లు సైతం లభించాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో కొందరు ఈ తరహాలో గ్రూప్‌లుగా ఏర్పడి ప్రత్యేక యాప్‌ల ద్వారా వారాంతాల్లో ‘ఎంజాయ్’ చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇలాంటి వ్యవహారాలు క్రమంగా విస్తరిస్తున్నాయని, జతగాళ్లను వెతుక్కొనేందుకు స్వలింగ సంపర్కులు ఈ తరహా గ్రూప్స్‌లో చేరుతున్నట్టు పోలీసులు చెప్తున్నారు. మరి కొందరు గేలు సాధారణ యువకులకు డ్రగ్స్‌ను ఎర వేసి, పార్టీలకు ఆహ్వానిస్తున్నారు. ఆ తర్వాత వారిని మత్తులో ముంచి ప్రకృతి విరుద్ధ చర్యలకు ప్రోత్సహిస్తున్నారు. ఇలా స్వలింగ సంపర్కుల ఉచ్చులో చిక్కిన సాధారణ యువకులు సైతం క్రమంగా గేలుగా మారుతున్నట్టు తెలుస్తున్నది.
సాధారణ యువతతో పోలిస్తే గేలలో డ్రగ్స్ వాడకం 7% అధికంగా ఉన్నట్టు గతంలో లెస్బియన్ అండ్ గే ఫౌండేషన్ (ఎల్జీఎఫ్) తన సర్వే నివేదికలో పేర్కొన్నది. సమాజంలో తిరస్కరణకు గురవడాన్ని తట్టుకోలేకపోవడంతోపాటు అంతర్గత భయాలను, సెక్స్‌లో బిడియాన్ని పోగొట్టుకునేందుకు వారు డ్రగ్స్‌కు అలవాటు పడుతున్నట్టు తేల్చింది.