యువతరంగం.. అనుభవసారం.. ఈ రెండింటిని మేళవించి బీఆర్ఎస్ తన విజయపరంపరను కొనసాగిస్తున్నది. ఇదే తన విజయ రహస్యమని బీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకు సాధించిన ఎన్నికల విజయాలు నిరూపించాయి. బీఆర్ఎస్ రాజకీయ ప్రత్యర్థులు సైతం ఇదే విషయాన్ని అంగీకరిస్తున్నారు. రాజకీయాల్లో 18 నుంచి 50-55 సంవత్సరాల వారిని యువ నాయకులుగా చెప్పుకొనే సంప్రదాయం ఉన్నది. ఈ లెక్కన బీఆర్ఎస్లో బరిలో నిలుపుతున్న 119 మంది అభ్యర్థుల్లో 68 మంది(57 శాతం) 55 ఏండ్లలోపువారే కావడం విశేషం.
హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): పాలనలో.. రాజకీయాల్లో యువరక్తం రావాలని ఉద్యమకాలం నుంచి బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అనేక సందర్భాల్లో చెప్పారు. ఎన్నికల సమరంలో ప్రత్యర్థి పార్టీలను కేసీఆర్ తన సమ్మోహన కూర్పుతో కకావికలం చేస్తారు. రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తన ప్రత్యర్థుల ముందు ఇదే సవాల్‌ను ఉంచింది. ఎన్నికల బరిలో నిలిచే పార్టీల్లో ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల కొరతతో కొట్టుమిట్టాడుతున్నాయి.
ఒకవేళ ఉన్నా ఆ పార్టీలు కురువృద్ధుల ఆధిపత్యంతో కునారిల్లుతున్నాయి. 2014, 2018 ఎన్నికల్లోనే కాకుండా ఈసారి కూడా బీఆర్ఎస్ పార్టీ కొత్తవారికి అవకాశం కల్పించింది. 2018 తరువాత జరిగిన ఉప ఎన్నికల్లోనూ యువ రక్తానికి అవకాశాలిచ్చింది. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కురువృద్ధుడు జనారెడ్డిపై నోముల భగత్ అనే యువకుడిని బరిలో నిలిపి అతిసునాయాసంగా విజయం సాధించింది. ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే, 63 ఏండ్ల కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని బరిలో నిలిపింది. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం నుంచి రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్న వివేక్‌పై బాల్క సుమన్‌ను నిలిపి జయకేతనం ఎగురవేసింది. తుంగతుర్తిలో గాదరి కిశోర్ లాంటి ఎంతోమంది యువకులకు బీఆర్ఎస్ పార్టీ చట్టసభల్లో అడుగుపెట్టే అవకాశం కల్పించింది.
పోచారం శ్రీనివాస్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్దన్, కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, డీఎస్ రెడ్యానాయక్ వంటి అనుభవ శీలురను ఎన్నికల బరిలో దింపుతూ ప్రజామోదాన్ని సొంతం చేసుకొన్నది. వచ్చేనెల జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే 115 మంది అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది. మరో 4 నాలుగుస్థానాల్లో పోటీచేసే అభ్యర్థులకు మౌఖిక సంకేతాలిచ్చింది. బీఆర్ఎస్లో బరిలో నిలుపుతున్న 119 మంది అభ్యర్థుల్లో 68 మంది 55 ఏండ్లలోపువారే ఉన్నారు.
ఇందులో ములుగులో బడే నాగజ్యోతి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి లాస్య నందిత, కోరుట్ల నుంచి డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, ఖానాపూర్ నుంచి భూక్యా జాన్సన్ రాథోడ్, కార్వాన్ నుంచి ఐ కృష్ణయ్య, మలక్‌పేట నుంచి తీగల అజిత్‌రెడ్డి వంటి ఏడుగురు కొత్తవారికి సీఎం కేసీఆర్ అవకాశం కల్పించారు. బీఆర్ఎస్తోనే రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన కేటీఆర్, హరీశ్‌రావు, దాస్యం వినయభాస్కర్, బాల్క సుమన్, అరూరి రమేశ్, నన్నపునేని నరేందర్, గాదరి కిశోర్, నోముల భగత్, శానంపూడి సైదిరెడ్డి.. ఇలా ఎంతోమంది యువకులను ప్రోత్సహిస్తూ రాజకీయాల్లో భవిష్యత్తు తరానికి యువ నాయకత్వాన్ని అందించే పనిని ముఖ్య మంత్రి కే చంద్రశేఖర్‌రావు పకడ్బందీగా అమలు చేస్తున్నారు.
అనుభవసారం.. పాలన పరిపక్వం
యువతను, అనుభవజ్ఞులను వారధిగా చేసి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో రెండుసార్లు ప్రజారంజక పాలన అందించి తెలంగాణను దేశానికి దిక్సూచిగా నిలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్, ఇప్పుడు అభ్యర్థుల ఎంపికలో అదే ఒరవడిని కొనసాగించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవమున్న రెడ్యానాయక్, ఎర్రబెల్లి దయాకర్‌రావు ఏడోసారి గెలుపు దిశగా అడుగులేస్తున్నారు. లంబాడా సామాజిక వర్గానికి చెందిన రెడ్యానాయక్ జనరల్ స్థానమైన డోర్నకల్ నియోజకవర్గంలో 1989 నుంచి 2004 వరకు గెలుస్తూ వచ్చారు. జనరల్ స్థానంలో గెలిచిన ఎస్టీ అభ్యర్థిగా రెడ్యానాయక్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఎస్టీ నియోజకవర్గంగా మారిన తర్వాత డోర్నక్లో 2009లో ఆయన ఓటమిపాలైనా 2014, 2018లో గెలుపొందారు. తాజాగా మరోసారి శాసనసభ ఎన్నికల్లో ప్రజా తీర్పు కోసం బరిలో నిలిచారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కూడా 1994 నుంచి వరుసగా ఓటమి ఎరగని నేతగా గుర్తింపు పొందారు.
మూడు స్థానాల నుంచి..
రాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ తరువాత.. బాజిరెడ్డి గోవర్ధన్‌కు ఒక ప్రత్యేకత ఉన్నది. అసెంబ్లీ చరిత్రలో ఒకే వ్యక్తి మూడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి గోవర్ధన్ గెలిచారు. ఆర్మూర్, బాన్సువాడ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల నుంచి గెలిచిన బాజిరెడ్డి ప్రస్తుతం ఐదోసారి ఎన్నికల బరిలో గెలుపు కోసం కసరత్తు చేస్తున్నారు.
రెండు స్థానాల నుంచి..
ఈ సారి పోటీచేస్తున్న భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ అభ్యర్థుల్లో రెండు నియోజకవర్గాల నుంచి గెలిచిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు (సిద్దిపేట, గజ్వేల్), ఎర్రబెల్లి దయాకర్‌రావు (వర్ధన్నపేట, పాలకుర్తి), కొప్పుల ఈశ్వర్ (మేడారం, ధర్మపురి), సబితా ఇంద్రారెడ్డి (చేవెళ్ల, మహేశ్వరం), తలసాని శ్రీనివాస్‌యాదవ్ (సికింద్రాబాద్, సతన్‌నగర్) ఉండటం విశేషం.
ఆరో టర్మ్ గెలుపు దిశగా…
బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల్లో ఇద్దరు ఆరో టర్మ్ గెలుపు కోసం బరిలో నిలిచారు. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆరోసారి టిక్కెట్లు దక్కించుకున్నారు. ఈ ఎన్నికల్లో గెలవడం ద్వారా ఈ ముగ్గురు ఆరో టర్మ్ గెలిచినవారి జాబితాలో చేరనున్నారు. అలాగే స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి 1994, 1999, 2009, 2014, 2018లో ఐదు టర్మ్‌లు గెలిచారు. 2011 ఉప ఎన్నికల్లోనూ గెలిచిన చరిత్ర ఆయనది.