Rythu Bima | హైదరాబాద్, మార్చి 3(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సర్కారు పాలనలో కష్టనష్టాలతో బతుకీడుస్తున్న రైతులకు ఎలాగో ఫాయిదా లేదు.. చివరికి మరణించిన రైతుల కుటుంబాలకు కూడా భరోసా దక్కడం లేదు. బీఆర్ఎస్ సర్కారు హయాంలో అకాలమరణం చెందిన రైతుల కుటుంబాలకు రైతుబీమా పథకం కింద రూ.5 లక్షల పరిహారం అందేది. తద్వారా ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా దక్కేది. కానీ, ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో రైతుబీమా పరిహారం కూడా కరువైంది. కాంగ్రెస్ సర్కారు ఎల్ఐసీకి ప్రీమియం చెల్లించకపోవడమే ఇందుకు కారణం. 2024-25 సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం రైతుల తరుపున చెల్లించాల్సిన ప్రీమియంను ఇప్పటివరకు చెల్లించలేదని సమాచారం. దీంతో మరణించిన రైతుల కుటుంబాలకు పరిహారం అందడంలో జాప్యం జరుగుతున్నట్టు తెలిసింది.
విడతలవారీగా చెల్లింపులు
ఇంటి పెద్ద దిక్కుగా ఉన్న రైతు మరణిస్తే ఆ కుటుంబం రోడ్డును పడొద్దనే ఉద్దేశంతో నాటి సీఎం కేసీఆర్ రైతుబీమా పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. రైతులు చెల్లించాల్సిన బీమా ప్రీమియాన్ని కూడా ప్రభుత్వమే చెల్లించేలా నిర్ణయం తీసుకున్నారు. ఏటా ఆగస్టులో ఒకేసారి సుమారు 40 లక్షల మంది రైతులకు రూ.1,450 కోట్లకు పైగా ఎల్ఐసీకి కేసీఆర్ సర్కారు ప్రీమియం చెల్లించేది. కానీ, కాంగ్రెస్ హయాంలో ఇది విడతలవారీగా మారింది. గత ఆగస్టులో ప్రభుత్వం రూ.700 కోట్లు చెల్లించింది. మిగిలిన సుమారు రూ.750 కోట్లను ఆర్నెళ్ల తర్వాత అంటే ఫిబ్రవరిలో చెల్లించాల్సి ఉంది. కానీ, ప్రభుత్వం ఈ మొత్తాన్ని ఎల్ఐసీకి చెల్లించలేదని తెలిసింది. ఎప్పటిలోపు చెల్లిస్తుందో కూడా స్పష్టత లేకపోవడం గమనార్హం. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వానికి నిధుల కోసం వ్యవసాయ శాఖ లేఖ రాసినట్టు తెలిసింది. కానీ, ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి సమాధానం రాలేదని సమాచారం.
పరిహారం మంజూరు ఆలస్యం
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వివిధ కారణాలతో మరణించిన సుమారు 2 వేల మందికి పైగా రైతు కుటుంబాలకు రైతుబీమా పరిహారం పెండింగ్లో ఉన్నట్టు సమాచారం. ఇందులో కొన్ని ఎల్ఐసీ వద్ద ఉండగా.. మరికొన్ని డీఏవోల వద్ద పెండింగ్లో ఉన్నట్టు తెలిసింది. వాస్తవానికి బీఆర్ఎస్ హయాంలో ఏటా ఠంచనుగా రైతుబీమా ప్రీమియం చెల్లించడంతో రైతుల కుటుంబాలకు త్వరగా పరిహారం మంజూరయ్యేది. కానీ, ఇప్పుడు ప్రీమియం చెల్లింపుల్లో ఆలస్యం కారణంగా పరిహారం మంజూరులోనూ ఆలస్యమవుతున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుడు జూలై నాటికి సుమారు 3 వేలకు పైగా కుటుంబాలకు పరిహారం పెండింగ్లో ఉండడం గమనార్హం. అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
రైతుల కుటుంబాలు ఆగమాగం
ఓ వైపు కరువు.. మరోవైపు పండించిన పంటను అమ్ముకోలేని దుస్థితి. ఎరువులకు గోస, నీళ్లకు గోస, కరెంట్ గోస.. వీటికి తోడు ప్రభుత్వం నుంచి అందని రైతుభరోసా వెరసి రైతులు కాంగ్రెస్ పాలనలో రైతులు ఆగమాగమవుతున్నారు. ఇన్ని కష్టాలకు తట్టుకోలేక, చేసిన అప్పులు భరించలేక రైతులు తనువు చాలిస్తున్నారు. సగటున రోజుకి ఒకరు చొ ప్పున బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఈ విధంగా ఇప్పటికే 450 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు ఓ అంచనా. వారే కాకుండా ప్రమాదాలు, అనారోగ్యం, ఇతర కారణాలతో వందల మంది రైతులు మరణించారు. ఈ రైతు కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయి అనాథలయ్యాయి. పరిహారం అందక అరిగోస పడుతున్నాయి. దీంతో కాంగ్రెస్ సర్కారుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హస్తం పాలనలో బతికినా.. చచ్చినా కష్టమేనని మండిపడుతున్నారు.