హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/మలక్‌పేట, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): చాదర్‌ఘాట్ పరిధిలోని మూసీ పరీవాహక ప్రాంతాల్లో ఎక్స్కవేటర్ అడుగుపెట్టడంతో స్థానికులు మళ్లీ భయాందోళనకు గురయ్యారు. గతంలో ఇండ్లు కూల్చివేయగా మిలిగిన మొండిగోడలను అధికారులు బుధవారం తొలగించారు.చాదర్‌ఘాట్ పరిధిలోని మూసానగర్, ఓల్డ్ మలక్‌పేట పరిధి శంకర్‌నగర్‌లో సుమారు 150 వరకు ఇండ్లను కూల్చివేశారు. అంబేద్కర్ హట్స్, సాయిలు హట్స్, అజయ్ హట్స్ ప్రాంతాల్లో 109 వరకు గుడిసెలు గుర్తించారు. వీటిల్లో 26 వరకు గుడిసెల్ని కూల్చివేశారు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం వారికి అండగా బీఆర్ఎస్ పోరాడడంతో కూల్చివేతల ప్రక్రియను ప్రభుత్వం నిలిపివేసింది. బాధితులకు చంచల్‌గూడ పిల్లి గుడిసెలు, వనస్థలిపురం, ప్రతాపసింగారం, జియాగూడ ప్రాంతాల్లో కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను కేటాయించారు. ఈ నేపథ్యంలో మళ్లీ ఎక్స్‌కవేటర్‌తో అధికారులురావడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీనిపై మలక్‌పేట ఎమ్మెల్యే బలాలను ‘నమస్తే’ సంప్రదించగా గతంలో కూల్చివేతల్లో మిగిలిన గోడలను తొలగించే పనులు చేపట్టినట్టు తెలిపారు.