హైదరాబాద్ : ఇది ఓ వింత ఘటన. ఎవరూ ఊహించని ఘటన అని చెప్పొచ్చు. ఎందుకంటే అప్పుడే పుట్టిన ఓ కుక్క పిల్లను కోతి ఎత్తుకెళ్లింది. ఇక చెట్టు మీదకు వెళ్లిన కోతి.. కుక్క పిల్లను ముద్దాడుతూ మురిసిపోయింది. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరి గ్రామంలో వెలుగు చూసింది.
తిరుమలగిరి గ్రామంలో ఓ కుక్క తన పిల్లలకు జన్మనిచ్చింది. దీంతో ఆ కుక్క పిల్లలన్నీ తల్లి కుక్క చుట్టూ చేరిపోయాయి. అయితే అక్కడే ఉన్న ఓ చెట్టుపై ఉన్న కోతి మాత్రం.. ఎవరూ ఊహించని విధంగా.. అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఓ కుక్క పిల్లలను కోతి ఎత్తుకెళ్లి చెట్టు కొమ్మలపై కూర్చుంది. కుక్క పిల్లను తన పిల్లగా భావించి.. శునకాన్ని ముద్దాడుతూ మురిసిపోయింది వానరం. ఇక కుక్క పిల్ల కింద జారిపడకుండా చెట్లపై గ్రామం అంతా తిరిగింది కోతి. వానరం ప్రేమను చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు.