వెంకటాపురం(నూగూరు), జూన్ 14: ఎవరైనా చనిపోతే కుటుంబసభ్యులు, బంధువులు మృతదేహం వద్దకు చేరుకొని వారు బతికి ఉన్న రోజులను గుర్తు చేసుకొని రోదిస్తూ ఉంటారు. కానీ, ఓ వ్యక్తి చనిపోతే, అతడితో కలిసి తిరిగిన ఓ వానరం కంటతడి పెట్టుకోవడం అందరినీ కలచివేసింది. వివరాల్లోకి వెళితే..
ములుగు జిల్లా వెంకటాపురం
(నూగూరు)బీసీ మర్రిగూడెం గ్రామానికి చెందిన వీర్రాజు స్థానిక దుర్గమ్మ గుడికి ప్రసాదం తీసుకెళ్తూ ఉండేవాడు. అమ్మవారికి మొక్కులు అప్పజెప్పిన అనంతరం గుడి వద్ద ఉన్న ఓ కోతికి ప్రసాదం పెడుతూ దాంతో స్నేహంగా ఉండేవాడు. కాగా అనారోగ్యంతో శనివారం వీర్రాజు మృతి చెందాడు. రోజూ వచ్చే వీర్రాజు గుడికి రాకపోవడంతో వానరం ఆయనను వెతుక్కుంటూ ఇంటికి చేరుకున్నది. మృతిచెందిన వీర్రాజును చూసి తల్లడిపోయి కంటతడిపెట్టి, కడుపు నింపిన విశ్వాసాన్ని చాటింది. ఈ ఘటనను చూసిన గ్రామస్థులు వానర ప్రేమకు ఫిదా అయ్యారు. మూగ జీవి అయినా మనుషుల కంటే నయం అంటూ పొగడ్తలు కురిపించారు.