హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో మిషన్ భగీరథ శాఖ చీఫ్ ఇంజినీర్లు, సూపరింటెండింగ్ ఇంజినీర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మిషన్ భగీరథ కార్యకలాపాల వివరాలను అధికారులను అడిగి తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ..గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా పరిస్థితిని ప్రతిరోజూ నిశితంగా పర్యవేక్షించాలని, రాష్ట్రంలోని ప్రతి మారుమూల గ్రామానికి రోజువారీ నీటి సరఫరా జరిగేలా చూడాలని ఆమె ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లు, నదులు, తదితర తాగునీటి వనరుల స్థాయిలను అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. రిజర్వాయర్లలో నీటి మట్టాలు తగ్గినప్పుడల్లా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, ఇరిగేషన్ అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
మేడారం జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు
మేడారం జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేసి విజయవంతం చేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. త్వరలో మేడారం జాతరపై సంబంధిత డిపార్ట్మెంట్లతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు.