అది జూన్ 26.. గురువారం ఉదయం కామారెడ్డి ఆర్టీఏ చెక్‌పోస్టులో నిర్వహించిన ఏసీబీ సోదాల్లో కొన్ని నిమిషాల వ్యవధిలోనే పట్టుబడిన డబ్బు సుమారు రూ.20 వేలు. 8 గంటలు వేచి చూసి పట్టుకున్న మొత్తం రూ.90 వేలు. ఒక్కో లారీ డ్రైవర్ అక్కడ కనీసం సమర్పించుకునే సొమ్ము వెయ్యి రూపాయలు. ఒక్కో ఏజెంట్ ఒక షిఫ్టుకు పనిచేస్తే అందే మొత్తం రూ.8 వేలు. అక్కడ రోజుకు వసూలు చేసే మొత్తం కనీసం రూ.2.50 లక్షలు. అదంతా అక్రమంగా వసూలు చేసేదే. ఇలా ఒక్క చెక్‌పోస్టు నుంచే ఏడాదికి కోట్ల రూపాయలు పక్కదారి పడుతున్నది. అయినా రవాణాశాఖ మంత్రి, ఉన్నతాధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహారిస్తున్నారు.
హైదరాబాద్, జూలై 6: (నమస్తే తెలంగాణ) : అధికారుల అజమాయిషీలో పనిచేయాల్సిన ఆర్టీఏ చెక్‌పోస్టులు ఏజెంట్ల చేతుల్లోకి వెళ్లాయి.. ఏ చెక్‌పోస్టులో చూసినా నలుగురైదుగురు షిప్టుల వారీ విధుల్లో ఉంటున్నారు.. కంటికే కనిపించని అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారు.. ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు పెద్ద ఎత్తున గండికొడుతున్నారు. తెలంగాణ అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులు ఇలా అక్రమాలకు ఆలవాలంగా మారాయి. రాత్రిపూట చెక్‌పోస్టుల్లో గస్తీ కాయాల్సిన అధికారులు పత్తాలేకపోవడంతో ప్రభుత్వ సొమ్మును ఏజెంట్లు ఎగబడి దోచుకుంటున్నారు. ఇలా ఆర్టీఏ చెక్‌పోస్టులు ప్రైవేట్ వ్యక్తులకు కల్పతరువుగా మారాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఈ దళారుల రాజ్యం.. అక్రమ వసూళ్ల వ్యవహారంతో భారీగా ఖజానాకు గండిపడుతున్నది.
ఇంత జరుగుతున్నా ఆర్టీఏ ఉన్నతాధికారులెవరూ చెక్‌పోస్టుల్లో ఆకస్మిక తనిఖీలనైనా చేపట్టడం లేదు. ఏసీబీ అధికారులు అడపాదడపా దాడులు చేపట్టి చేతులు దులుపుకుంటున్నారు. సోదాల్లో లెకల్లో చూపని నగదును భారీగా గుర్తించినా, సంబంధిత అధికారులపై కఠిన చర్యలు లేకపోవడంతో అక్రమ వసూళ్ల తంతు షరా మామూలుగానే మారిందని అంటున్నారు. ఇటీవల నిర్వహించిన ఏసీబీ సోదాల్లో సుమారు రూ.2 లక్షల వరకూ బ్యాంకుల్లో జమ చేయని నగదు దొరికింది. కొన్ని నిమిషాల్లో నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లోనే ఇంత మొత్తంలో నగదు పట్టుబడితే.. ఒకరోజు మొత్తంలో ఒక్కో చెక్‌పోస్టు నుంచి ఎంత నగదు చేతులు మారుతుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాది తెలంగాణలో 33 ఆర్టీఏ కార్యాలయాలు, చెక్‌పోస్టుల్లో ఏసీబీ తనిఖీలు చేపట్టింది. ఈ తనిఖీల్లో మొత్తం రూ.2.72 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఆర్టీఏ సంబంధిత చెక్‌పోస్టుల నుంచే రూ.1.81 లక్షలు ఉన్నాయి.
ఆర్టీఏ చెక్‌పోస్టుల్లో కొన్నిచోట్ల సీసీ కెమెరాల ఉండటంతో చెక్‌పోస్టుకు ముందే వాహనాలను నిలిపివేస్తున్నారు. భారీ వాహనాల ఓవర్ లోడింగ్ చూస్తే చాలు నోటికి తోచినంత డబ్బు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొన్నిచోట్ల చెక్‌పోస్టుల ఎదుటే చిన్న బాక్సులు ఏర్పాటు చేసుకొని వాటిల్లో డ్రైవర్లు డబ్బులు వేసేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ఒక్కో డ్రైవర్ నుంచి కనీసం రూ.1,000కి తగ్గకుండా వసూళ్లు చేస్తున్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ ఏడాది తనిఖీల్లో 28 మంది ఏజెంట్లను అరెస్టు చేయడంతోపాటు, వారి అవినీతి బాగోతాన్ని వీడియోల్లో చిత్రీకరించారు. మారుమూల చెక్‌పోస్టు నుంచి హైదరాబాద్ కార్యాలయంలోని ఉన్నతాధికారులకూ కమీషన్లలో వాటాలు వెళ్తున్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు.
పట్టుబడిన ఏజెంట్లు, అధికారుల ఫోన్లను స్వాధీనం చేసుకొని పరిశీలించగా ఈ అవినీతి బాగోతం బయటపడ్డట్టు విశ్వసనీయ సమాచారం. దీంతో స్థానిక అధికారుల యూపీఐ లావాదేవీలు, బ్యాంకు లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆర్టీఏ అధికారుల అక్రమ వసూళ్లపై నివేదిక తయారు చేసిన ఏసీబీ అధికారులు.. ప్రభుత్వానికి అందించనున్నట్టు సమాచారం. తెలంగాణలో ఆర్టీఏకి చెందిన 14 అంతర్రాష్ట్ర చెక్‌పోస్టుల్లోనే ఈ అవినీతి వెలుగుచూస్తున్నా.. ఉన్నతాధికారులు ఎలాంటి తనిఖీలు చేపట్టడం లేదు. డ్రైవర్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా ఎక్కడా ఉన్నతాధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టిన దాఖలాలు లేవు.