యాచారం, మార్చి 20: రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మొండిగౌరెల్లికి చెందిన రైతులు పారిశ్రామిక వాడ ఏర్పాటు కోసం తమ భూములను తీసుకోవద్దని రెండురోజుల క్రితం ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డికి, యాచారం తహసీల్దార్ అయ్యప్పకు భూములు తీసుకోవద్దని వినతిపత్రం ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా గురువారం గ్రామానికి చెందిన నాయకులు బండిమీది కృష్ణ, తాండ్ర రవీందర్ రైతులతో కలిసి రాష్ట్ర రైతుకమిషన్ చైర్మన్ కోదండరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ‘సారూ..మాభూములను తీసుకోవద్దు, పారిశ్రామిక వాడ కోసం చేపట్టనున్న భూ సేకరణ నోటిఫికేషన్ను రద్దు చేయాలి’ అని విన్నవించారు. సాగు చేసుకొని జీవనోపాధి పొందుతున్న దళితులు, పేదల భూములను పరిశ్రమల కోసం బలవంతంగా సేకరిస్తే ఎలా బతకాలని ప్రశ్నించారు. పచ్చని పొలాల్లో పరిశ్రమలను ఏర్పాటు చేయొద్దని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా సెంటు భూమిని కూడా వదులుకునేదిలేదని రైతులు స్పష్టం చేశారు. సమస్యను అధిష్ఠానం దృష్టికి తీసుకుపోయి న్యాయం చేసేందుకు కృషి చేస్తానని కోదండరెడ్డి హామీ ఇచ్చినట్టు రైతులు పేర్కొన్నారు.