హైదరాబాద్, నవంబర్ 11(నమస్తే తెలంగాణ): రాజకీయాల కోసమే ప్రధాని మోదీ రాష్ట్రంలో పర్యటిస్తున్నారే తప్ప తెలంగాణ అభివృద్ధి కోసం కాదని ఎఫ్డీసీ చైర్మన్ అనిల్ కూర్మాచలం విమర్శించారు. విభజన హామీలను అమలు చేశాకే తెలంగాణ గడ్డపై మోదీ కాలుమోపాలని శుక్రవారం ఆయన ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు.
వ్యవసాయ నల్ల చట్టాలను తీసుకొచ్చి.. రైతు, కార్మిక వ్యతిరేక విధానాలతో ప్రైవేటీకరణ దిశగా ముందుకు సాగుతున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వరంగ సంస్థలను ఇష్టానుసారంగా అమ్మకానికి పెట్టారని దుయ్యబట్టారు. రామగుండంలో ఏడాదిన్నర నుంచే ఎరువుల ఉత్పత్తి జరుగుతున్న ఆర్ఎఫ్సీఎల్ కర్మాగారాన్ని.. మోదీ ఇప్పుడు జాతికి అంకితం ఇవ్వటానికి రావడం విడ్డూరంగా ఉన్నదన్నారు. తెలంగాణకు అన్ని రంగాల్లో మొండి చెయ్యి చూపిన మోదీ.. ఇక్కడి ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.