హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): ఒకనాడు గవర్నర్ల వ్యవస్థను వద్దే వద్దన్న మోదీకి ఇప్పుడు అదే వ్యవస్థ అక్కరకు వస్తున్నది. విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టడానికి గవర్నర్లను నాడు యూపీఏ ఏ విధంగా వాడుకొన్నదో.. నేడు మోదీ అంతకంటే ఎక్కువగా వాడుకొంటున్నారు. ముఖ్యంగా తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతుండటంతో తట్టుకోలేని బీజేపీ ప్రభుత్వం.. తెలంగాణపై గవర్నర్ అస్ర్తాన్ని ప్రయోగించింది. ఊహించినట్టుగానే గవర్నర్ తమిళిసై నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిస్పందన మొదలైంది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్.. తన పరిధిని అతిక్రమించి ఢిల్లీలో, హైదరాబాద్‌లో విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు. పదే పదే కేంద్ర హోం మంత్రిని కలిసి తెలంగాణ ప్రభుత్వ పనితీరుపై నివేదికలు ఇచ్చినట్టు ప్రకటలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన ఆమోదం కోసం పంపిన బిల్లును ఉద్దేశప్వూకంగానే తొక్కిపెట్టినట్టు కూడా బాహాటంగా వెల్లడిస్తూ కయ్యానికి కాలు దువ్వుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం పంపించే బిల్లులను ఆమోదించకుండా తిప్పి పంపించే అధికారం గవర్నర్‌కు ఉన్నదా? అనే అంశం పై రాజ్యాంగ నిపుణులు చర్చిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ఆమోదానికి పంపిన బిల్లులో ఏదైనా చట్ట విరుద్దంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నట్టు భావిస్తే వాటిని తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించి వివరణ కోరవచ్చు. కానీ గవర్నర్ అలా చేయకుండా బిల్లుల ఆమోదం తన పరిధిలోని అంశం అంటూ కొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చారు. ఆమోదానికి నిర్దిష్ట సమయమేమీ లేదని మాట్లాడుతున్నారు. రాజ్యాంగంలో గవర్నర్ వ్యవస్థ ఒక భాగమే తప్ప గవర్నరే ప్రభుత్వం కాదు.
రాష్ట్ర మంత్రి మండలి సలహాల మేరకే గవర్నర్ తన విధులను నిర్వర్తించాల్సి ఉంటుంది. యూనివర్సిటీలలో నియామకాలకు సంబంధించిన బిల్లును ఆమోదించకుండా తొక్కిపెట్టారు. విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తామని హెచ్చరించిన తరువాత కానీ బిల్లుపై సందేహాలున్నాయని.. విద్యామంత్రి వచ్చి వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి ఓ లేఖ రాసి కొత్త పేచీ పెట్టారు. వాస్తవానికి ఇదొక్కటే బిల్లు కాదు.. గవర్నర్ ఆమోదం కోసం పంపించిన ఏడు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.
‘నా ఫోన్ ట్యాప్ అవుతుందనే అనుమానం కలుగుతున్నది’.. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బుధవారం మీడియా సమావేశంలో అన్న మాటలివి. బీజేపీయేతర రాష్ట్రప్రభుత్వాలతో పేచీకి దిగుతున్న ప్రతి గవర్నర్ కామన్‌గా చెప్తున్న వ్యాఖ్య కూడా ఇదే. పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ జగదీప్ ధన్కర్, కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్‌ఖాన్, తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి కూడా తమ ఫోన్లు ట్యాప్‌కి గురైనట్టు అనుమానాలు వ్యక్తం చేశారు. అంతేనా అసెంబ్లీ ఆమోదం పొందిన బిల్లును తొక్కిపెట్టి.. ‘బిల్లులను ఆమోదించేకంటే ముందు సందేహాలను నివృత్తి చేసుకోవాల్సిన అవసరం ఉండదా?’ అని తమిళిసై అన్నట్టుగానే.. ఆరిఫ్ మహమ్మద్‌ఖాన్, ఆర్ఎన్ రవి ఒకే తరహా ప్రశ్నలు లేవనెత్తారు.
రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన సాగుతున్నదని, రాజ్‌భవన్ మాత్రమే ప్రజాభవన్ అంటూ ఈ ముగ్గురు గవర్నర్లు వివిధ సందర్భాల్లో ఒకే విధంగా స్పందించడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నది. కోయిలలు వేరు.. వారు పాడే పాట మాత్రం ఒకటేనని, ఆ పాట నేర్పిస్తున్నది కేంద్రంలో హోం మంత్రి పదవిలో ఉన్న పెద్దాయన అని విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం.. ఎవరో ఇచ్చిన స్క్రిప్టు చదువుతున్నట్టుగా ఉన్నదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. గవర్నర్లు కేంద్ర పెద్దలను కలిసి వచ్చిన తర్వాతే రాష్ట్ర సర్కార్లపై రాజకీయ దాడి పెరగడాన్ని కూడా వారు గుర్తుచేస్తున్నారు.
ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న హయాం లో అప్పటి గవర్నర్ రాంలాల్ వ్యవహరం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. మూడింట రెండు వంతుల మెజార్టీతో అధికారంలో ఉన్న ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని.. గవర్నర్ రాంలాల్ ఏకపక్షంగా రద్దుచేసి నాదెండ్ల భాస్కర్‌రావును సీఎం చేశారు. దీంతో రాంలాల్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం జరిగింది. ప్రజల ఆగ్రహానికి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దిగి వచ్చింది. ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని పునరుద్ధరించాల్సి వచ్చింది. రాంలాల్‌ను తెలుగు ప్రజలు తరిమేశారు. ఆ తరువాత గవర్నర్‌గా వచ్చిన కుముద్‌బెన్ జోషి తన హయాంలో రాజ్‌భవన్‌ను గాంధీభవన్‌గా మార్చేశారన్న ఆరోపణలు వచ్చాయి. బీజేపీ హయాంలో ఆ పార్టీ అధికారంలో లేని రాష్ర్టాలపై గవర్నర్ల జోక్యం మితిమీరిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రంతో సఖ్యతగా ఉంటే సరి.. లేకుంటే ఇబ్బందులు తప్పవన్న విధంగా గవర్నర్లు వ్యవహరిస్తున్నారు. గతంలో ఉత్తరప్రదేశ్‌లో గవర్నర్ రమేశ్ భండారీ.. బీజేపీ ప్రభుత్వం ఏర్పడకుండా అడ్డుకొన్నారని బీజేపీ అగ్రనేత అటల్ బిహారీ వాజపేయి ఢిల్లీలో నిరశన దీక్ష చేసిన ఉదంతం కూడా గమనార్హం.