ఆయన వల్లే లంక అధ్యక్షుడికి కష్టాలు
బీజేపీది అదానీ అంబానీల ఇంజిన్
రాష్ట్రం బాగుంటే బీజేపీకి మంట
ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ధ్వజం
హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): ప్రెస్‌మీట్ పెట్టాలంటే ప్రధాని నరేంద్ర మోదీకి భయమని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ ఎనిమిదేండ్లలో ఒక్కసారైనా ప్రెస్‌మీట్ పెట్టారా? అని ప్రశ్నించారు. మీడియా ప్రశ్నలకు భయపడి మోదీ ప్రెస్‌మీట్ పెట్టడం లేదని విమర్శించారు. సోమవారం టీఆర్ఎస్ఎల్పీలో ఎంపీ లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, కంచర్ల భూపాల్‌రెడ్డితో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడా రు. బీజేపీ నేతలు మాట్లాడితే డబుల్ ఇంజిన్ సర్కారు అని అంటున్నారని.. కానీ అది ట్రబుల్ ఇంజిన్ సర్కా రు అని, అదానీ, అంబానీల ఇంజిన్ అని విమర్శించారు. శ్రీలంకలో ఆ దేశ అధ్యక్షుడు గొటబయకు మోదీ వల్లే కష్టాలు వచ్చాయని ఆరోపించారు. తెలంగాణ కూడా శ్రీలంకలా మారుతుందని బీజేపీ నేతలు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.
తెలంగాణ తలసరి ఆదాయం యూపీ, జాతీయ సగటు కన్నా ఎకువని గుర్తు చేశారు. దేశానికి తెలంగాణ అన్నం పెట్టే స్థాయికి చేరిందంటే కేసీఆర్ విధానాల వల్లేనని చెప్పారు. దేశం కేసీఆర్ నుంచి నేర్చుకోవాలని, తెలంగాణ అభివృద్ధి మాడల్ దేశానికి అవసరమని అన్నారు. బీజేపీ తోడేళ్ల గుంపు తెలంగాణపై పడిందని, కానీ ఇక్కడ కేసీఆర్ అనే పులి ఉన్నదని ఆ పార్టీ నేతలను హెచ్చరించారు. తెలంగాణ బాగుపడుతుంటే బీజేపీ నేతలకు కడుపు మండి చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. అన్నం తినే ఏ తెలంగాణ బిడ్డా టీఆర్ఎస్ను వదులు కోరని, రైతు బంధు, రైతు బీమా ఇచ్చిన కేసీఆర్‌ను వదులుకోరని స్పష్టం చేశారు. కేసీఆర్‌కు ఎన్నికలంటే భయం లేదని, ఆయన రక్తంలో భయమనేది లేదని తేల్చి చెప్పారు. నాడు ఆంధ్రాకు నీళ్లు తరలిస్తుంటే మంత్రిగా హారతులు పట్టిన డీకే అరుణకు కేసీఆర్ గురించి మాట్లాడే స్థాయి ఉన్నదా? అని నిలదీశారు. ఆమె మంత్రిగా ఉండగా ఇలాంటి పథకా లు అమలు చేశారా? పాలమూరుకు ఇన్ని నీళ్లు ఎపుడై నా తెచ్చారా? అని ప్రశ్నించారు. కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి తెలంగాణకు ఏమైనా చేశారా? అని నిలదీశారు.
బీసీ ప్రధాని అయినా!: లింగయ్య యాదవ్
ప్రధాని మోదీ బీసీ అయినా బీసీగణన చేపట్టలేదని, కేంద్రంలో బీసీలకు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయలేదని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నుంచే ఇకడి ప్రజలపై మోదీ కక్ష పెంచుకొన్నారని మండిపడ్డారు. విభజన హామీలు అమలు చేయడంలేదని దుయ్యబట్టారు. తెలంగాణ నుంచి కేంద్రానికి రూ.2.65 లక్షల కోట్లు పన్నుల రూపంలో వెళ్తే రాష్ర్టానికి ఆ స్థాయిలో నిధులు ఇవ్వడం లేదని తెలిపారు. కేసీఆర్‌కు దేశంలో ఆదరణ పెరుగుతున్నదని, ఆయన నాయకత్వంలోనే దేశం ముందుకు వెళ్లటం ఖాయమని చెప్పారు. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రెస్‌మీట్ తర్వాత బండి సంజయ్‌కు మెంటలెకిందని ఎద్దేవా చేశారు. తెలంగాణ కన్నా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏదైనా మంచి జరిగితే చెప్పాలని బీజేపీ నేతలకు సవాల్ విసిరారు. టీఆర్ఎస్లో ఏక్‌నాథ్‌షిండేలు ఎవరూ లేరని, బీజేపీలోనే మోదీకి యూపీ సీఎం ఆదిత్యనాథ్ రూపంలో ఏక్‌నాథ్‌షిండే ఉన్నారని పేర్కొన్నారు.