విభజన హామీలు ఏమయ్యాయి
ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి
దేవరకొండ, ఫిబ్రవరి 10: బీజేపీ, ప్రధాని మోదీ దేశానికి పట్టిన శని అని ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి విమర్శించారు. పార్లమెంటు సాక్షిగా తెలంగాణ రాష్ట్రంపై అక్కసు వెళ్లగక్కడం తగదని హితవుపలికారు. గురువారం నల్లగొండ జిల్లా దేవరకొండలో ఆయన మాట్లాడుతూ.. 2014లో రాష్ట్ర విభజన చట్టంపై చర్చ జరిగినప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ ఎంపీ సుష్మాస్వరాజ్, ఆ పార్టీ నాయకులు మద్దతిచ్చారని, వారిని మోదీ విస్మరించినట్టేనని పేర్కొన్నారు. ఆ విభజన చట్టంలో ఉన్న తెలంగాణకు గిరిజన వర్సిటీ, ప్రాజెక్టులకు జాతీయస్థాయి హోదా ఇవ్వకుండా కేంద్రం నిర్లక్ష్యం చేస్తున్నదని, దక్షిణాది రాష్ర్టాలపై సవతి ప్రేమ చూపుతున్నదని విమర్శించారు. 2019లో నియోజకవర్గాల పునర్విభజన చేయాలని విభజన చట్టంలో ఉన్నా.. పట్టించుకోకుండా రాష్ట్రంపై అక్కసుతో మాట్లాడటం ప్రధానమంత్రి స్థాయికి తగదని సూచించారు. జమ్ముకశ్మీర్‌ను విభజించి డీ లిమిటేషన్ కమిటీ వేశారని, తెలంగాణపై ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణలోని 7 మండలాలను ఏపీలో రాత్రికి రాత్రి కలుపడం ఏమిటని నిలదీశారు.