హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీ రాజ్యాంగ వ్యవస్థలను, స్వతంత్రప్రతిపత్తి కలిగిన సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి డీ రాజా విమర్శించారు. స్వతంత్రంగా ఉండాల్సిన న్యాయవ్యవస్థ కూడా ప్రమాదంలో ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. బీజేపీ, ఆరెస్సెస్ ఫాసిస్టు శక్తులు రాజ్యాంగ, ప్రజాస్వామ్య శక్తులపై దాడి చేస్తున్నాయని, ఈ చర్యల పట్ల ప్రజలలో చైతన్యం తీసుకురావాలని చెప్పారు. డిసెంబర్ 25న ఖమ్మంలో జరగనున్న ‘సీపీఐ శతాబ్ది ఉత్సవాల’ను జయప్రదం చేయడం ద్వారా దేశం, ప్రపంచానికి ఒక గొప్ప సందేశాన్ని ఇవ్వాలని అన్నారు. హైదరాబాద్ మఖ్ధూంభవన్లో శుక్రవారం సీపీఐ రాష్ట్ర సమితి సమావేశం జరిగింది. రాష్ట్ర కార్యవర్గసభ్యులు దండి సురేశ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాజా, జాతీ య కార్యదర్శి అజీజ్ పాషా మాట్లాడారు.
స్థానిక సంస్థల్లో బీసీలకు 42%రిజర్వేషన్ అమలు చేసేందుకు ప్రభుత్వం ఆర్డినెన్స్ తేవాలని నిర్ణయించడం ఆహ్వానించదగ్గ పరిణామం అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే సాంబశివరావు అన్నారు. అయితే తమిళనాడు తరహాలో 9వ షెడ్యూల్ చేర్చి అమలు చేస్తే బాగుటుందని సూచించారు.