న్యూస్‌నెట్‌వర్క్/హైదరాబాద్, డిసెంబర్ 21(నమస్తే తెలంగాణ): కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం మల్కాపూర్‌లో ఉపాధి హామీ కింద పొలంలో నిర్మించుకున్న కల్లం ఇది. ధాన్యాన్ని ఆరబెడుతున్న ఈ రైతు పేరు రాజలింగం. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అవకాశంతో ఉపాధిహామీ పథకం కింద రాజలింగం ఈ సిమెంటు కల్లాన్ని నిర్మించుకున్నారు. ఇందులో తప్పేముంది? కానీ ఇది ముమ్మాటికి తప్పేనని చెప్తున్నది కేంద్ర ప్రభుత్వం. అంతటితో ఆగకుండా అలా ఉపాధి హామీ కింద రెండేండ్ల క్రితం నిర్మించిన కల్లాలన్నింటికి సంబంధించి చెల్లించిన బిల్లులను వెనక్కి తీసుకుంటామని హెచ్చరిస్తున్నది. వడ్లు ఎండబోసేందుకు గ్రామాల్లో తగినన్ని స్థలాలు లేకపోవడం, రోడ్లపై ధాన్యం ఆరబోతతో జరుగుతున్న ప్రమాదాలను నివారించడం కోసం.. తెలంగాణ ప్రభుత్వం రైతులను ఈ దిశగా ప్రోత్సహించింది.
2020 జూన్ నుంచి జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద ఇలా సిమెంట్ కల్లాలను నిర్మించుకునేందుకు అవకాశం కల్పించింది. ఎస్సీ రైతులకు పూర్తి ఉచితంగా, బీసీ, ఇతర రైతులకు 10 శాతం కాంట్రిబ్యూషన్ చెల్లించేలా వెసలుబాటు కల్పించింది. ఐదెకరాలు ఉన్న రైతులు సిమెంట్ కల్లం నిర్మాణానికి అయ్యే ఖర్చు ముందుగానే చెల్లిస్తే రెండు దశల్లో తిరిగి చెల్లిస్తామని ప్రభుత్వం స్పష్టంచేసింది. కల్లాల నిర్మాణాన్ని 50 చదరపు అడుగుల్లో నిర్మించుకుంటే రూ. 56 వేలు, 60 చదరపు మీటర్లలో నిర్మించుకుంటే రూ. 68 వేలు, 68 చదరపు మీటర్లలో నిర్మించుకుంటే రూ. 75 వేలు చెల్లిస్తామని పేర్కొనడంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ముందుకు వచ్చి కల్లాలు నిర్మించుకున్నారు. కరీంనగర్ జిల్లాలో 366, పెద్దపల్లి జిల్లాలో 363, జగిత్యాల జిల్లాలో 284 సిమెంట్ కల్లాలను రైతులు నిర్మించుకున్నారు. వరంగల్ జిల్లాలో 2,224 మంది రైతులు తమ పొలాల్లో కల్లాలను నిర్మించుకునేందుకు దరఖాస్తులు చేసుకున్నారు. వీటి నిర్మాణం కోసం సుమారు రూ.18.8 కోట్లు మంజూరు చేశారు. వీరిలో కొందరు రైతులు పనులు పూర్తి చేసుకుని బిల్లులు తీసుకున్నారు. మరికొందరు రైతులు కల్లం నిర్మించుకున్నప్పటికి కేంద్రం కొర్రీల వల్ల బిల్లులు తీసుకోలేకపోయారు. ఇలా ఒక్కో జిల్లాలో వందల సంఖ్యలో నిర్మాణ దశలో ఉన్నాయి.
కల్లాలకు కేంద్రం మోకాలడ్డు
అయితే తెలంగాణపై ఇప్పటికే అప్రకటిత యుద్ధాన్ని కొనసాగిస్తున్న కేంద్రం.. రైతులకు ప్రత్యక్షంగా ఉపయోగపడే కల్లాలు వ్యవసాయంలో భాగం కాదనే రీతిలో వ్యవహరిస్తున్నది. ఉపాధి హామీ నిధులను కల్లాలకు వినియోగించవద్దంటూ వక్రభాష్యాలు చెప్తున్నది. ఈ పథకానికి వెచ్చించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలంటూ హుకుం జారీ చేసింది. ఇతర రాష్ర్టాల్లో చేపలు ఎండబెట్టుకునే కల్లాల నిర్మాణానికి అడ్డురాని నిబంధనలను తెలంగాణలో రైతు కల్లాల విషయంలో తెర మీదకు తెచ్చి, తన దుర్బుద్ధిని చాటుకుంటున్నది. నిజానికి వ్యవసాయానికి ఉపాధి హామీ పనులను అనుసంధానం చేయాలని సీఎం కేసీఆర్ అనేకమార్లు కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
పార్టీ పరంగా, తెలంగాణ ప్రభుత్వ పరంగా తీర్మానాలు చేసి కేంద్రానికి పంపించారు. అయితే దీనిని పట్టించుకోని కేంద్రం.. వ్యవసాయ అనుబంధ పనులకు కూడా కోత పెడుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం రూ.750 కోట్ల అంచనా వ్యయంతో 89 వేల రైతు కల్లాలను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఆయా పనులను నిలిపివేయాలని కేంద్రం చెప్పే సమయానికే రాష్ట్రంలో రూ.151 కోట్ల విలువైన పనులను పూర్తి చేశారు. ఇప్పుడు ఆ రూ.151 కోట్లు తిరిగి చెల్లించాలంటూ కేంద్రం హుకూం జారీ చేసి, రైతు వ్యతిరేక బుద్ధిని చాటుకుంటున్నది. వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ పనులకు ఉపాధి హామీ నిధులను ఖర్చు చేయవచ్చనే నిబంధన ఉన్నా.. తప్పుడు నివేదికలతో రాష్ట్రంపై కక్ష సాధింపుకు పాల్పడుతున్నది. కేంద్రం ప్రదర్శిస్తున్న ఈ వక్రబుద్ధిపై రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
కేంద్రం నిర్ణయాలు రైతులు, కూలీల పాలిట శాపం
కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు రైతులు, ఉపాధి హామీ కూలీల పాలిట శాపంగా మారాయి. సముద్ర తీర ప్రాంతంలో చేపలను అర పెట్టుకోడానికి ప్లాట్‌ఫాం ఉపాధి హామీ పథకంలో నిర్మించుకోవడానికి అనుమతి ఉన్నప్పుడు రైతులు పంటలు ఆరపెట్టుకోవడానికి ప్లాట్‌ఫాం ఉపాధి హామీ పథకం ద్వారా నిర్మించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు కొర్రీలు పెడుతున్నదో.? ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. పంట కాలువల పూడికతీత పనులు, అడవులలో తవ్వుతున్న కందకాలు ఉపాధి హామీ పథకంలో చేపడుతున్నారు. బడుగు బలహీనర్గాలకు చెందిన మహిళలు, ప్రజలు ఉపాధి హామీ పథకం ద్వారా పని చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రైతులకు ఉపయోగపడే పనులను అడ్డుకోవడం ద్వారా రైతులు, పేదల ప్రజల జీవన ప్రమాణాలను దెబ్బ తీసినట్టే అవుతుంది.
– ఏలేటి చిన్నారెడ్డి, రైతు, ఇబ్రహీంపట్నం(జగిత్యాల జిల్లా)
అవ్వ పెట్టదు అడుక్కోనివ్వదు…
అవ్వ పెట్టదు, అడుక్కోనివ్వదు అన్నట్టుగా కేంద్రం వైఖరి ఉన్నది. ఇది సరికాదు. నిధులు రైతులకు ఉపయోగపడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. కేంద్రం కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నది.
– చల్లా రవీందర్‌రెడ్డి, రైతు, కేశవాపూర్, వరంగల్ జిల్లా
ఇంత అన్యాయమా?
రైతులకు ఇచ్చిన నిధులు వెనుకకు తీసుకునుడంటే అన్యాయమే. ఇట్ల చేసిన ప్రభుత్వాన్ని నేను ఇంతవరకు సూడలే. ఉపాధి హామీ పథకంతో వ్యవసాయాన్ని జోడించాలని రైతులు కోరుకుంటున్నరు. కేంద్ర ప్రభుత్వమేమో ఇట్ల అన్యాయం చేస్తున్నది. రైతులంటనే పగబట్టినట్టు చేస్తే ఎట్ల? ఏడాదికిందట వచ్చిన కేంద్రం బృందం కల్లాలను చూసి మెచ్చుకున్నది. రిపోర్టు మాత్రం వ్యతిరేకంగా ఇచ్చిండ్రని ఏడాది తర్వాత ఇప్పుడు చెప్తున్నరు. ఇది పద్ధతి కాదు. ఈ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలి. లేదంటే రైతులు ఆందోళనకు దిగుతరు.
– మంద తిరుపతి, రైతు, గోపాల్పూర్ (కరీంనగర్ రూరల్)
రైతు వ్యతిరేకి బీజేపీ
కేంద్రంలోని బీజేపీ సర్కార్‌వి రైతు వ్యతిరేక విధానాలు. అన్నదాతను అరిగోస పెడుతున్నది. తెలంగాణ ప్ర భుత్వం కల్లాలు నిర్మించుకునేందుకు అవకాశం ఇస్తే, కేంద్రం అడ్డుకోవడం దారుణం. వ్యవసాయ కల్లాలకు ఉపాధి హమీ నిధులు నిలిపివేయడం మంచిదికాదు.
– నత్తి రాజ్‌కుమార్, యువ రైతు, సర్పరాజ్‌పూర్ (జగిత్యాల జిల్లా)