మారేడ్‌పల్లి, సెప్టెంబర్ 6: కేంద్రంలో బీజేపీ సర్కారుకు ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటుపరం చేయడంలో ఉన్న శ్రద్ధ, చిత్తశుద్ధి కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో లేదని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ విమర్శించారు. రైల్వే కార్మికులు తలచుకుంటే దేశంలో ఒక్క రైలు కూడా కదలదని, మోదీ ప్రభుత్వానికి తమ సత్తా చూపే సమయం దగ్గరలోనే ఉన్నదని అన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో మంగళవారం ప్రారంభమైన నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేమెన్ (ఎన్ఎఫ్ఐఆర్) 30వ జాతీయ మహాసభలకు మంత్రి తలసాని ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
రైల్వే కార్మికులు ఐక్యంగా ఉండి రానున్న ఎన్నికలలో బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని సూచించారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేనివిధంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. ఎన్ఎఫ్ఐఆర్ జాతీయ ప్రధాన కార్యదర్శి, దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మర్రి రాఘవయ్య మాట్లాడుతూ… మూడు రోజులపాటు జరిగే ఈ సమావేశాల్లో రైల్వే వ్యవస్థను రక్షించుకోవాలనే నినాదంతో అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. కొత్త పెన్షన్ విధానం రద్దు చేసే వరకు పోరాటం ఆపబోమని, అవసరమైతే సమ్మెకు కూడా దిగుతామని హెచ్చరించారు. రైల్వేలో ఖాళీగా ఉన్న 2 లక్షల 70 వేల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయీస్ సంఘ్ అధ్యక్షుడు ప్రభాకర్ ఆండ్రూస్స్, ఎన్ఎఫ్ఐఆర్ అధ్యక్షుడు గుమాన్‌సింగ్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్పీ భట్నాగర్, యూనియన్ నాయకులు భరణి భానుప్రసాద్, రుద్రారెడ్డి, షేక్ రవూఫ్, నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.