హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): మోదీ ప్రభుత్వం కాంట్రాక్టు, ప్రైవేటీకరణ విధానాలతో లాభాల్లో ఉన్న సింగరేణిని బతికుండగానే చంపే కుట్ర చేస్తున్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ అనుమా నం వ్యక్తం చేశారు. సింగరేణిలో తెలంగాణకు 51 శాతం వాటా ఉన్నందున దాన్ని కేంద్రం ప్రైవేటీకరణ చేయలేదని, అందుకే గనులను ప్రైవేటుపరం చేస్తున్నదని మండిపడ్డారు. ఆదివారం మగ్దుంభవన్‌లో సీపీఐ జాతీయ సమి తి సభ్యులు పల్లా వెంకట్‌రెడ్డి, ఈటీ నర్సింహతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. 2015లో గోదావరి పరీవాహక ప్రాం తంలోని బొగ్గుబావిని సింగరేణికి ఇవ్వాలనే మైన్ మినరల్స్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ చట్టాన్ని సవరించి కమర్షియల్ మైనింగ్‌కు అనుమతిచ్చారని, తద్వారా 240 గనులను ప్రైవేటుకు ఇచ్చేందుకు గుర్తించారని ఆరోపిం చారు.
వీటిలో 98 గనులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించ గా, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఒకరని తెలిపా రు. ఇల్లందులోని కైరాగూడ ఓసీ 3 మైన్, సత్తుపల్లి ఓసీ 3 మైన్, మందమర్రిలోని శ్రావణపల్లి, కళ్యాణకణి మైన్స్‌ను ప్రైవేటుకు ఇచ్చేందుకు నోటిఫికేషన్ జారీచేసినట్టు చెప్పా రు. మోదీ పర్యటన రాజకీయ దురుద్దేశంతో కూడిందే తప్ప రాష్ట్ర అభివృద్ధికి ఏ మాత్రం ఉపయోగపడలేదన్నారు. మునుగోడులో ఓటమితో నిరాశలో ఉన్న బీజేపీ శ్రేణులను ఉత్సాహపర్చేందుకే మోదీ రాష్ట్ర పర్యటనకు వచ్చారని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో చిల్లరకొట్టు మాదిరి అవినీతి జరిగితే, బీజేపీ వచ్చాక హోల్‌సేల్‌గా మారిపోయిందని ఎద్దే వా చేశారు. అసలైన కుంభకోణాలు చేసేవారు, అవినీతిపరులు మోదీ వద్దనే ఉన్నార న్నారు. అవినీతిపరుల పని పడతామని చెబుతున్న ఆయన.. ముందు అదానీ పనిపట్టాలని డిమాండ్ చేశారు. ఏమీ చేయకుండానే అదానీ ప్రపంచంలో రెండో అతిపెద్ద ధనవంతుడు ఎలా అయ్యాడని నారాయణ ప్రశ్నించారు.
ప్రైవేటు ఉత్పత్తిని అడ్డుకుంటాం
ఖమ్మం, నవంబర్ 13 (నమస్తేతెలంగాణ ప్రతినిధి) : సింగరేణిపై ప్రధాని మోదీ మాటల గారడీ చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. ఆదివారం ఆయన ఖమ్మంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. బొగ్గు నిక్షేపాలను వెలికితీసేందుకు ప్రైవేటు వ్యక్తులకు సింగిల్ టెండర్ ద్వారా కట్టబెట్టే ప్రయత్నం జరుగుతున్నదని, దీన్ని సీపీఐ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అడ్డుకుంటామని హెచ్చరించారు. మోదీ రాక సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 7 వేల మంది సీపీఐ కార్యకర్తలను అరెస్టు చేశారని కూనంనేని తెలిపారు. గతంలో రాజులను ప్రశ్నిస్తే జైళ్లకు పంపినట్టు మోదీని ప్రశ్నించే వారందరినీ అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. రెండేండ్ల క్రితం ప్రారంభమై, ఉత్పత్తిని కొనసాగిస్తున్న ఎరువుల కర్మాగారాన్ని ఇప్పుడు జాతికి అంకితం చేయాల్సిన అవసరం ఏమున్నదని ప్రశ్నించారు.